గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం ఎలాగైనా డబ్బులు కావాలని ఓ యువకుడు కిడ్నాప్ నాటకం ఆడాడు. తానే తల్లింద్రులకు ఫోన్ చేసి 2.5 లక్షలు డిమాండ్ చేశాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్‌లోని భీండ్ జిల్లా గోహద్ ప్రాంతానికి చెందిన సందీప్.. తన గర్ల్‌ఫ్రెండ్ ఖర్చులు భరించేందుకు కొంత డబ్బు అవసరమని భావించాడు. ఇందుకోసం తాను కిడ్నాప్‌కు గురైనట్లు నాటకం ఆడాడు. కిడ్నాపర్లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించాడు. కుమారుడిని విడిచిపెట్టాలంటే రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈనెల 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సందీపే కిడ్నాపర్ అని వెల్లడైంది. అతని మొబైల్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గ్వాలియర్‌లో సందీప్ ఆచూకీని గుర్తించారు. కిడ్నాప్ డ్రామాపై యువకుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వాయిస్ ఛేంజర్ యాప్ ద్వారా సందీప్ గొంతు మార్చి కిడ్నాపర్లాగ మాట్లాడాడని పోలీసులు వెల్లడించారు.
'గురుగ్రామ్‌లోని నా గర్ల్‌ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు, ఆమె ఖర్చుల కోసం ఇచ్చేందుకు నాకు డబ్బు కావాలి. తల్లిదండ్రులను అడిగితే వారు అందుకు తిరస్కరించారు. అందుకే ఈ కిడ్నాప్ డ్రామా ఆడాను' అని యువకుడు వెల్లడించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి :10 వేల కానిస్టేబుల్ పోస్టులకు 12 లక్షల దరఖాస్తులు!