ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు యూపీ తీవ్రవాద వ్యతిరేక దళం(UP ATS), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రకటించాయి. దావూద్ ఇబ్రహీం అనుచరులు 2019 డిసెంబర్‌లో.. రాష్ట్రంలోని మతపరమైన స్థలాల్లో రెక్కీ నిర్వహించినట్లు కనుగొన్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు.. రెక్కీ సమయంలో వీరంతా కాన్పుర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించాయి. వారికి సహాయంగా బిహార్‌కు చెందిన ఇద్దరు ఆయుధాల స్మగ్లర్లు, ఓ మహిళ కూడా ఉన్నట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ వివరించారు.
దిల్లీ అరెస్టులతో లింకులు..
గతవారం దిల్లీలో అరెస్టైన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన మొహమ్మద్ అమీర్ జావేద్ బంధువే ఈ రెక్కీ నిర్వహించినట్లు నిఘాసంస్థలు కనుగొన్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టైన హుమైద్ అనే వ్యక్తి ఈ రెక్కీల వెనుక ప్రధాన సూత్రధారి అని గుర్తించిన ఏటీఎస్.. అమీర్ జావేద్‌కు ఇతను సోదరుడేనని తేల్చింది. అతనికి సంబంధించిన కారులోనే అప్పట్లో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా అయ్యాయని.. ఇది అమీర్ తండ్రి పేరుపై రిజిస్టర్ అయిందని పేర్కొంది. వీరితో పాటు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అమీర్ జావేద్ అత్తమామలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు దిల్లీలో అరెస్టైన అమీర్ మొబైల్ ఫోన్‌లో కొన్ని ఫోటోలను కనుగొన్న ఏటీఎస్.. వాటిలోని ఇద్దరు యువకుల జాడను కనిపెట్టింది. అయితే.. దర్యాప్తు ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకే వారి ఫోటోలను ఉంచి.. ఆపై డిలీట్ చేసినట్లు గుర్తించింది.
మొబైల్స్ ఏమైనట్టు?