తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC పేపర్​ లీక్ కేసులో మరో ట్విస్ట్.. రూ.6 లక్షలకు DAO ప్రశ్నాపత్రం విక్రయం

Division Accounts Officer Paper Leak in Telangana: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రశ్నాపత్రం లీకైనట్టు బయటపడింది. ఈ కేసులోనూ పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దీంతో ఆరు పరీక్షలను రద్దు చేశారు. ఇప్పటికే 15 మందిని అరెస్ట్‌ చేశారు. డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్, సుష్మితను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. తాజా అరెస్టులతో నిందితుల సంఖ్య 17కు చేరింది.

TSPSC paper leakage
TSPSC paper leakage

By

Published : Apr 8, 2023, 9:27 AM IST

Division Accounts Officer Paper Leak in Telangana: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సూత్రధారి ప్రవీణ్‌కుమార్‌ నడిపిన వ్యవహారం అంతా ఇంతా కాదు. ప్రశ్నపత్రాల లీకేజీ పరంపర అతను కొనసాగించినట్టు సిట్‌ విచారణలో బయటపడుతోంది. తాజాగా డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రశ్నపత్రం కూడా లీకైనట్టు తేలింది. ఈ వ్యవహారంలో ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్‌, సుష్మితను పోలీసులు అరెస్టు చేశారు.

DAO paper sold for six lakhs in Telangana : ఖమ్మం ప్రాంతానికి చెందిన సాయిలౌకిక్, సుస్మిత భార్యాభర్తలు. సాయిలౌకిక్‌ కార్ల వ్యాపారి. సుస్మిత ఓ సంస్థలో పనిచేసేవారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆమె ఉద్యోగం మానేశారు. ఆ తరువాత గ్రూప్‌1 పరీక్షకు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చినపుడు లీకేజ్‌ సూత్రధారి ప్రవీణ్ పరిచయమయ్యాడు. మాటల సందర్భంలో తన వద్ద డీఏఓ ప్రశ్నపత్రం ఉన్న విషయం తెలిపాడు. సుస్మిత ఈ విషయాన్ని సాయిలౌకిక్‌కు చెప్పింది.

DAO Paper Leak in Telangana : అనంతరం హైదరాబాద్‌ వచ్చిన సాయిలౌకిక్‌ 10లక్షల రూపాయలకు డీఏవీ మాస్టర్‌ ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్రవీణ్‌తో బేరమాడాడు. అడ్వాన్స్‌గా 6 లక్షలు ఇచ్చి ప్రశ్నాపత్రం తీసుకెళ్లాడు. మిగిలిన సొమ్ము ఫలితాల అనంతరం ఇచ్చేందుకు ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చి 11 టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్​ ఓవర్‌సీర్‌ ప్రశ్నపత్రం బయటపడినట్టు కమిషన్‌ ఉద్యోగి బేగంబజార్‌ పోలీసులు ఫిర్యాదు చేయటంతో లీకేజ్‌ విషయం బట్టబయలయింది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రవీణ్​కుమార్​, రాజశేఖర్​రెడ్డితో కలిపి 15మందిని అరెస్టు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్లలో జాబితాను పరిశీలించారు.

SIT Inquiry in TSPSC paper leak case: ప్రవీణ్‌కుమార్‌ బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు నిర్దారణకు వచ్చారు. అదే సమయంలో బడంగ్‌పేట్‌లోని ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో సిట్‌ పోలీసులు రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు తన వేతనం నుంచి పొదుపు చేసిందని.. కొత్త కారు కొనుగోలు చేసేందుకు దాచినట్టు ప్రవీణ్‌కుమార్‌ సిట్‌ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. బ్యాంకు ఖాతాలో ఒకేసారి 6 లక్షలు జమ అయినట్టు నిర్దారణకు వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్‌ ద్వారా ఆ నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో డీఏఓ ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక రాథోడ్, ఢాక్యానాయక్, నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్, శ్రీనివాస్, రాజేందర్‌నాయక్, రమేష్‌కుమార్, ప్రశాంత్‌ షమీమ్, సురేష్, ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌కుమార్, తిరుపతయ్య, సాయిలౌకిక్, సుష్మితలు అరెస్టయ్యారు.

సాయిలౌకిక్, సుస్మితలను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 17 మంది నిందితుల్లో ఇప్పటి వరకు పోలీసులు16 మందిని అరెస్టు చేశారు. గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన ప్రశాంత్‌ న్యూజిలాండ్‌లో ఉన్నారు. ఆయనకు సిట్‌ పోలీసులు వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపారు. సమాధానం రాకపోవటంతో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేశారు.

ఇవీ చదవండి:

''పది' లీకేజీ కేసు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా..?'

"కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌కి కస్టోడియన్‌ ఎవరుంటారు? బాధ్యత ఎవరిది?"

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు.. క్వశ్చన్ పేపర్లు ఎవరెవరికి చేరాయి..?

ABOUT THE AUTHOR

...view details