తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరిలో అధికారానికి కమలం తహతహ

పుదుచ్చేరిలో జెండాపాతాలని భాజపా తహతహలాడుతోంది. ఇందుకు తగ్గట్టుగానే తన మార్క్​ రాజకీయాలకు తెరలేపింది. దీంతో అక్కడి రాజకీయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి పార్టీ ఆల్‌ ఇండియా నమదు రాజ్యం కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌సీ-ఎన్నార్‌ కాంగ్రెస్‌), హస్తం పార్టీకి గట్టి పోటీ ఇవ్వనుండగా... ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్న భాజపా 'పుదుచ్చేరి'పైనా పట్టు సాధించాలని చూస్తోంది.

The BJP is all set to take power in Pondicherry
పుదుచ్చేరిలో అధికారానికి కమలం తహతహ

By

Published : Mar 22, 2021, 7:30 AM IST

Updated : Mar 22, 2021, 9:59 AM IST

సాధారణ పరిస్థితుల్లోనైతే పుదుచ్చేరి ఎన్నికలు కన్పించకుండానే ముగిసిపోతాయి. కానీ ఈసారి భాజపా 'రాజకీయం' కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భౌగోళికంగా కేవలం 4 ప్రాంతాలతో కూడిన (పుదుచ్చేరి, కారైక్కాల్‌, మాహే, యానాం) పుదుచ్చేరిలో ఉన్నవి 30 శాసనసభ స్థానాలే! ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ 'కాంగ్రెస్‌'లోనే నెలకొనటం విశేషం. కాంగ్రెస్‌, ఆ పార్టీ నుంచి వెలుపలికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి సొంతంగా స్థాపించిన ఆల్‌ ఇండియా నమదు రాజ్యం కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌సీ-ఎన్నార్‌ కాంగ్రెస్‌) మధ్యనే పోటీ తీవ్రంగా ఉంది. ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్న భాజపా 'పుదుచ్చేరి'పైనా పట్టు సాధించాలని ఊవిళ్లూరుతోంది. అందుకే ప్రచారానికి ప్రధాని మోదీని సైతం రంగంలోకి దించింది.

కాంగ్రెస్‌లో అభ్యర్థులు లేక!

కూటమి తరఫున కాంగ్రెస్‌ 14, డీఎంకే 13, విడుదలై చిరుతైగళ్‌ 1, సీపీఐ ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. ఎప్పుడూ అధిక స్థానాలు తీసుకొని ఇతర పార్టీలకు తక్కువ స్థానాలు కేటాయించే కాంగ్రెస్‌కు ఈసారి అభ్యర్థులు కరువయ్యారనీ అందుకే... డీఎంకేకు ఎక్కువ (13 సీట్లు) కేటాయించిందనే వాదన వినిపిస్తోంది. "మా అభ్యర్థులనుకున్నవారు చివరి నిమిషంలో పార్టీ నుంచి వెలుపలికి వెళ్లారు. దీంతో డీఎంకేకు అధిక స్థానాలు ఇవ్వక తప్పలేదు" అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలుగు వారి ప్రాబల్యం కలిగిన యానాంలో కాంగ్రెస్‌ తరఫున అభ్యర్థే లేకపోవడం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమిలో ఎన్నార్‌ కాంగ్రెస్‌ 16, భాజపా 9, అన్నాడీఎంకే 5 స్థానాల నుంచి అభ్యర్థులను నిల్చోబెట్టాయి. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురికి భాజపా టికెట్లు ఇచ్చింది.

కాంగ్రెస్‌-డీఎంకే కూటమి బలం - బలహీనతలు

  • సంప్రదాయ ఓటు బ్యాంక్‌ (+)
  • అంతంత మాత్రంగా ప్రచారం (-)
  • ప్రభుత్వం కూలిపోవడంపై సానుభూతి (+)
  • నారాయణస్వామి హయాంలో అంతంతగా అభివృద్ధి (-)
  • భాజపాకు ఓటర్లు ప్రాధాన్యమివ్వరన్న నమ్మకం (+)

ఎన్నార్‌ కూటమి బలం - బలహీనతలు

  • ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమి అధ్యక్షుడు రంగస్వామికున్న గుర్తింపు (+)
  • సీఎం అభ్యర్థి రంగస్వామి అని భాజపా చెప్పకపోవడం (-)
  • నారాయణస్వామి ప్రభుత్వ వైఫల్యాలు (+)

ఇదీ చూడండి: అసోం, పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

Last Updated : Mar 22, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details