TDP Protests Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగుదేశం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పలుచోట్ల పోలీసులు దీక్షలను భగ్నం చేసి.. శ్రేణులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా... నిర్బంధాలు చేసినా.. అధినేతను విడుదల చేసేవరకు తగ్గేదే లేదంటూ కార్యకర్తలు దీక్షలు నిర్వహించారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా... చంద్రబాబు అరెస్టుపై ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కారు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో నందమూరి బాలకృష్ణ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్... ప్రతిపక్ష నేతలను కూడా అక్రమ కేసుల్లో ఇరింకించాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు మంచి జరగాలని కోరుకుంటూ... రిషికేష్‌లో విజయవాడ MP కేశినేని నాని దంపతులు పూజలు నిర్వహించారు. నిరసన దీక్షకు వెళ్తున్న పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడును పోలీసులు అడ్డగించారు. ఒంటరిగా వెళ్తున్న తనను ఎలా ఆపుతారంటూ నిమ్మల పోలీసులను నిలదీశారు. పోలీసులకు, నిమ్మలకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.
శ్రీసత్యసాయి జిల్లా... అధినేత చంద్రబాబుపై జగన్ తప్పుడు కేసులు పెట్టించారని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధ్వజమెత్తారు. బాబుతో నేను పేరుతో ధర్మవరం పోలీస్ స్టేషన్ సర్కిల్లో చేపట్టిన రిలే దీక్షా శిబిరానికి మైక్ అనుమతి లేదంటూ పోలీసులు మైకును తొలగించారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు బి.కె. పార్థసారధి ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, రిమాండ్ నిరసిస్తూ ఐదు రోజులపాటు రిలే దీక్షలు కొనసాగించనున్నారు. నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. బాబుతో నేను అనే నినాదంతో కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు రిలే దీక్ష చేపట్టారు. జగన్ పాలనలో అన్నీ వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు.
TDP Activists Protest in Srikakulam: శ్రీకాకుళంలో టీడీపీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
అనకాపల్లి జిల్లా... చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని అనితా తెలిపారు.
ఏలూరు జల్లా... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోషులు బయట తిరుగుతుంటే.. నిర్దోషులు జైళ్లలో ఉన్నారని మాజీ ఎంపీ మాగంటి బాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమఅరెస్ట్నునిరసిస్తూ పార్టీ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ నేతలు దీక్షలు చేపట్టగా...పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీక్షా శిబిరానికి అనుమతి నిరాకరించడంతో....పక్కనే ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నేతలు దీక్షకు కూర్చుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో దీక్షకు అనుమతి లేదంటూ మరోసారి పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను అడ్డుకున్నారు.