Supreme court delhi air pollution: వాయు కాలుష్యం కట్టడిలో దిల్లీ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దిల్లీ ప్రభుత్వం చేపట్టిన 'రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్' క్యాంపెయిన్... ప్రజాదరణ కోసం చేసే నినాదం తప్ప ఇంకేమీ కాదని వ్యాఖ్యానించింది. దిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.
Sc on delhi government: వాయు కాలుష్యం కట్టడి కోసం ఇంటి నుంచి పని, లాక్ డౌన్, పాఠశాలలు, కళాశాలల మూసివేత వంటి చర్యలు చేపడతామని గత విచారణ సమయంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తెలిపిందని ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ.. పెద్దలు ఇంటి నుంచి పని చేస్తుంటే పిల్లలు పాఠాశాలలకు వెళ్తున్నారని విమర్శించింది. "తమ ఆరోగ్యాన్ని ఎవరు కాపాడతారంటూ బ్యానర్లు పట్టుకుని రోడ్డుపై పేద యువకులు నిల్చుంటున్నారు. ఇలాంటి సమయంలో దిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రజాదరణ కోసం చేసే నినాదాలు కాక ఇంకేంటి?" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Sc deadline on delhi pollution: వాయు కాలుష్యం కట్టడి కోసం వివిధ చర్యలు చేపట్టామని చెబుతూ దిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మను సింఘ్వీ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఇది కాలుష్యానికి మరో కారణం, రోజూ ఎన్నో అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. రోడ్డుపై బ్యానర్లు పట్టుకుని ఎంత మంది నిల్చుంటున్నారో అఫిడవిట్లో పేర్కొన్నారా?" అని ప్రశ్నించింది. వాయు కాలుష్య నియంత్రణ కోసం సరైన ప్రణాళిక రూపొందించాలని దిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి 24 గంటల గడువు విధించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు.