తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Student Suspicious Death: గిరిజన వసతి గృహంలో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి - గిరిజన వసతి గృహంలో విద్యార్థి మృతి

Student Suspicious Death: ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెంలో అనుమానాస్పద రీతిలో విద్యార్థి మృతి చెందాడు. నిద్రపోతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని వెళ్లగా.. తెల్లవారేసరికి చేతిలో ఓ లేఖతో విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఏజెన్సీ ఉలిక్కిపడింది.

Student Suspicious Death
విద్యార్థి అనుమానాస్పద మృతి

By

Published : Jul 11, 2023, 8:59 PM IST

Updated : Jul 11, 2023, 10:22 PM IST

విద్యార్థి అనుమానాస్పద మృతి

Student Suspicious Death: ఏలూరు జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గిరిజన వసతి గృహంలో ఉన్న అఖిల్ చనిపోవడం తోటి విద్యార్థులను భయాందోళనకు గురి చేసింది. నిద్రపోతున్న విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. తెల్లవారే సరికి విద్యార్థి మృతదేహం హాస్టల్ ఆవరణలో పడి ఉంది. అఖిల్ చేతిలో ఉన్న లేఖ చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఉర్రింక గ్రామానికి చెందిన అఖిల్ వర్ధన్ రెడ్డి.. బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గిరిజన వసతి గృహంలోనే ఆ విద్యార్థి ఉంటున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులంతా నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొంత మంది యువకులు వచ్చి కరెంటు తీసేసి.. సెల్‌ఫోన్‌ లైట్ల వేసుకుని వచ్చారు. నిద్రలో ఉన్న అఖిల్‌ను దుప్పటితోపాటే ఎత్తుకెళ్లినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. తెల్లవారేసరికి పాఠశాల ఆవరణలో.. అఖిల్ విగతజీవిగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

హాస్టల్ వార్డెన్‌కు తెలిపిన సమాచారం మేరకు.. అఖిల్ మృతి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అఖిల్ కుటుంబసభ్యులకు, బంధువులను పిలిపించారు. అఖిల్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల గేటు వద్ద బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు.

మరోవైపు బాలుడి చేతిలో ఉన్న లేఖ దుమారం రేపుతోంది. ఈ పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని.. లేకుంటే అందరినీ చంపేస్తామని రాసి ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ మృతిపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు.

ఇటీవలే సీఎం జగన్మోహన్​ రెడ్డి సొంత జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సోహిత్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. సోహిత్ శరీరంపై పలు చోట్ల కమిలిన గాయాలు ఉండటంతో హాస్టల్ సిబ్బందే తమ కొడుకుని కొట్టి చంపారంటూ అతడి తల్లిదండ్రులు మృతదేహంతో పాఠశాల వద్దకు వచ్చారు. బాలుని మృతికి నిరసనగా అతని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. కాగా అదుపులోకి తెచ్చేందుకు వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ పాఠశాలకి ప్రభుత్వ గుర్తింపు రద్దు చేసి సీజ్ చేసింది. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..

Last Updated : Jul 11, 2023, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details