త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భాజపాను త్వరలో నేపాల్, శ్రీలంకలో విస్తరింపజేయాలని అధిష్ఠానం యోచిస్తోందని అగర్తలాలో పార్టీ సమావేశంలో ఆయన అనడం చర్చనీయాంశమైంది.
నేపాల్, శ్రీలంకలోనూ భాజపా విస్తరణ: త్రిపుర సీఎం "కేవలం మన దేశంలోనే కాదు... పొరుగు దేశాల్లోనూ భాజపాను విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. నేపాల్, శ్రీలంకలో పార్టీ విస్తరణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయాన్ని అమిత్ షా గతంలో పార్టీ ఈశాన్య రాష్ట్రాల పార్టీ కార్యదర్శి అజయ్ జమ్వాల్‌తో స్వయంగా ప్రస్తావించించారు"
--బిప్లవ్ కుమార్ దేవ్, త్రిపుర ముఖ్యమంత్రి
తృణమూల్ ఓటమి ఖాయం
బంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడం ఖాయమని బిప్లవ్ దేవ్ జోస్యం చెప్పారు. భాజపాను ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరింపజేసేందుకు షా అమితమైన కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, వామపక్షాల చేతుల్లో ఉన్న కేరళలోనూ భాజపా మార్పు తెస్తుందని చెప్పారు.
త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ గతంలోనూ ఓ సారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇంటర్నెట్, శాటిలైట్ టెక్నాలజీ మహాభారత కాలంలోనే ఉన్నాయని.. వాటిని అమెరికన్లు, యూరోపియన్లు ఇప్పుడు వినియోగించుకొంటున్నారని అన్నారు.
ఇదీ చదవండి :గుజరాత్ సీఎంకు కరోనా పాజిటివ్