Special status for bihar: గత 10-12 ఏళ్లుగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్న నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం.. తాజాగా ఈ అంశంపై తమ గళాన్ని మరింత పెంచుతోంది. ప్రత్యేక హోదా కల్పించేందుకు బిహార్ పూర్తి అర్హత సాధించిందని ఆ రాష్ట్ర మంత్రి బిజేంద్ర యాదవ్ తెలిపారు. ఈ మేరకు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్కు లేఖ రాశారు. బహుముఖ పేదరికంలో దేశంలోనే బిహార్ చివరిస్థానంలో ఉందని ఇటీవల ఓ నివేదికలోతేలిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు.
"తలసరి ఆదాయం, ఈజ్ ఆఫ్ లివింగ్, మానవ అభివృద్ధి వంటి సూచీల్లో జాతీయ సగటు కంటే బిహార్ దిగువన ఉంది. అధిక జనసాంద్రత, సహజ వనరుల కొరత, కరువు, వరదలు వంటివి రాష్ట్రంలో పేదరికం పెరిగేందుకు కారణమవుతున్నాయి. బిహార్లో ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నెలకొల్పకపోవడం వల్ల పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక విద్యకు నష్టం వాటిల్లుతోంది."
-బిజేంద్ర యాదవ్, బిహార్ మంత్రి.
Letter to niti aayog for special status: హరిత విప్లవ ప్రయోజనాలను బిహార్ కోల్పోయిందని తన లేఖలో బిజేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భౌగోళికపరంగా, చారిత్రపరంగా ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ గత దశాబ్దన్నరకాలంగా బిహార్ బలమైన వృద్ధి రేటును, న్యాయపరమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు. వ్యవసాయం, విద్యుత్తు, రహదారులు వంటివి ప్రజలకు తాము కల్పించామని, నాణ్యమైన పరిపాలన అందిస్తున్నామని తెలిపారు.