Sexual Harassment On Woman Judge :సమాజంలో ప్రత్యేక గౌరవం కలిగి ఉండి, అందరికీ న్యాయం చేసే ఒక మహిళా జడ్జికే పని ప్రదేశంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సివిల్ జడ్జికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తనతో పనిచేస్తున్న కొందరు సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు బహిరంగ లేఖ రాశారు.
'ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది'
సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన తనకు ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోందని లేఖలో ఆ మహిళా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా జిల్లా జడ్జి, ఆయన అనుచరులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని, రాత్రి వేళల్లో జిల్లా జడ్జిని ఒంటరిగా కలవమంటున్నారని మహిళా జడ్జి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
'ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు'
పని ప్రదేశంలో జరుగుతున్న లైంగిక వేధింపులను తాను ఈ జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ మహిళా జడ్జి లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా జడ్జి కింద పని చేసేవారేనని, తమ బాస్‌కు వ్యతిరేకంగా వారు సాక్ష్యం చెప్పగలరని తాను ఎలా నమ్మగలనని ఆమె లేఖలో ప్రశ్నించారు.