Road Accident in Prakasam: వారంతా రోజువారి కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఫంక్షన్లు, పెళ్లిల్లు, బర్త్డే పార్టీలకు డెకరేషన్ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలా ఆ విధులు ముగించుని ఇంటికి వస్తుండగా విధికి కన్ను కుట్టినట్లైంది. రోడ్డు ప్రమాదం రూపంలో నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపింది. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం వాంబే కాలనీకి చెందిన పిల్లి శ్రీను(35), చంద్రశేఖర్(33), కె.శ్రీను(22), సాయి(32) శుభకార్యాల్లో అలంకరణ పనులు చేసే కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలోని ఓ శుభకార్యానికి వెళ్లి అక్కడ అలంకరణ పనులు పూర్తి చేశారు. అనంతరం తిరిగి కారులో స్వస్థలం విజయవాడకు పయనమయ్యారు. అలా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని పౌరసరఫరాల గోదాము వద్దకు వచ్చేసరికి విజయవాడ నుంచి సత్యసాయి జిల్లా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టింది. అంతే పనుల బడలికలో గాఢ నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు తమతో వచ్చిన వారు విగతజీవులుగా పడి ఉన్నారు.