Rahul Hindutvawadi: హిందుత్వవాది గంగానదిలో ఒంటరిగా స్నానం చేస్తాడని, హిందువు.. కోట్లమందితో కలిసి స్నానం చేస్తాడన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ క్రమంలో హిందూ, హిందుత్వవాది మధ్య తేడా ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
" హిందూ వర్సెస్ హిందుత్వవాది.. హిందూ అంటే నిజం, ప్రేమ, అహింస. హిందుత్వవాది అంటే తప్పు, విద్వేషాలు, హింస. హిందుత్వవాది ఒంటరిగా గంగానదిలో స్నానం చేస్తాడు. కానీ హిందువు కోట్లమందితో కలిసి స్నానం చేస్తాడు. ప్రధాని మోదీ తాను.. హిందుత్వవాదిగా చెప్పుకుంటారు. కానీ ఆయన ఎప్పుడైనా నిజాన్ని కాపాడారా? మరి ఆయన హిందువా? లేక హిందుత్వవాదా?"
-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
ప్రధాని మోదీ నిర్ణయాలవల్లే..
Rahul Gandhi On Modi: ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాహుల్ ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దేశంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. వీటిపై ప్రధాని కానీ రాష్ట్ర సీఎం కానీ నోరు విప్పడంలేదని మండిపడ్డారు.