రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. దేశ ప్రజలపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని అన్నారు. ఇంతవరకూ ఏ రాజకీయ నాయకుడు దేశంలో శాంతికి బదులుగా హింస చేలరేగాలని కోరుకోలేదన్న ఇరానీ.. రాహుల్ మాత్రం గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన దాడులను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారని విమర్శించారు.
జనవరి 26న దిల్లీలో 400 మంది పోలీసులు గాయపడితే.. వారి గురించి రాహుల్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, మన జాతీయ జెండాను అవమానించే అరాచక శక్తులకు ఆయన అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు.