కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శనివారం ధ్వజమెత్తారు. రాజ్యాంగ విధివిధానాలను అవమానిస్తూ, అవాస్తవ ఆరోపణలు చేస్తూ దేశ వినాశకారిగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. అనవసర ఆరోపణలు చేసే రాహుల్‌కు బడ్జెట్‌పై కేంద్ర వివరణ వినే సహనం కూడా లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ గురువారం చేసిన వ్యాఖ్యలకు బదులుగా నిర్మల ఈ విధంగా స్పందించారు.
"కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని మనం గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే పార్లమెంట్ వ్యవస్థపైన వారికి పూర్తిగా నమ్మకం పోయిందన్న విషయం స్పష్టం అవుతోంది. సాగు చట్టాలను ప్రతిపాదించిన కాంగ్రెసే ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుందో అన్న విషయం నాకు తెలుకోవాలని ఉంది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి