కరోనా వైరస్ను ఎదుర్కోవటానికి టీకానే రక్షణ కవచం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. ఈ మేరకు జాతినుద్దేశించి సోమవారం సాయంత్రం ఆయన ప్రసంగించారు.
"తక్కువ సమయంలోనే దేశీయంగా రెండు టీకాలను భారత్ అభివృద్ధి చేసి... అగ్రదేశాలకు తీసిపోమని భారత్ నిరూపించింది. వ్యాక్సినేషన్లో ఆత్మనిర్భరత చాటింది. ఇప్పటివరకు 23 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఏడు సంస్థలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేయటంలో నిమగ్నమై ఉన్నాయి. టీకా తయారీ సంస్థలకు అన్ని విధాల మా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. టీకా అభివృద్ధి కోసం పరిశోధనలు జరుగుతున్న సమయంలోనే లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేశాం. గతేడాది ఏప్రిల్లోనే కరోనా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాం."
-ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ