పలు రాష్ట్రాల అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హరియాణా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు సహా సహా కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరిలకు ట్విట్టర్ వేదికగా ఆయా రాష్ట్రాలు సాధించిన ఘనతను గుర్తు చేస్తూ.. ట్వీట్లు చేశారు ప్రధాని మోదీ.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలతో రాణిస్తున్నారని మోదీ అభినందించారు.
"రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను."
- ప్రధాని నరేంద్ర మోదీ
దేశ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతోన్న కేరళ ప్రజలకు 'కేరళ పిరవి దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రకృతి అందాలకు కేరళ నిలయంగా ఉందని గుర్తుచేశారు. కేరళ ప్రజలు శ్రమజీవులని.. వారు చేసే పయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.