తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నివర్'​పై పోరుకు తమిళనాడు, పుదుచ్చేరి సన్నద్ధం

నివర్​ తుపాను ముంచుకొస్తున్న తరుణంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు జాగ్రత్తలు చేపట్టాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​ రంగంలోకి దిగింది. బుధవారం సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

prepearation-underway-in-tamilnadu-and-puduchery-to-tackle-cyclone-nivar
'నివర్'​పై పోరుకు తమిళనాడు-పుదుచ్చేరి సన్నద్ధం

By

Published : Nov 24, 2020, 6:29 PM IST

ముంచుకొస్తున్న నివర్​ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు సర్వ సన్నద్ధమయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను చేపట్టేందుకు ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. తమిళనాడులో 12, పుదుచ్చేరిలో 2, కరైకల్​లో 1 సహా మొత్తం 30 బృందాలు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది ఎన్​డీఆర్​ఎఫ్​.

తుపాను నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. తమిళనాడు రాజధాని చెన్నై సహా 7 జిల్లాల్లో బస్సు సర్వీసులను నిలిపివేశారు అధికారులు. తుపాను ముప్పు ఉన్న జిల్లాల్లో రైలు సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.

పొంగిపొర్లుతున్న వాగు
విరిగిపడ్డ చెట్టు

పుదుచ్చేరిలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది యంత్రాంగం. ఈ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

సీఎంల సమీక్ష...

తీర ప్రాంతంలో సహాయక చర్యల ఏర్పాట్లను పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణసామి స్వయంగా వెళ్లి సమీక్షించారు. అన్ని విభాగాలు హైఅలర్ట్​లో ఉన్నాయని, విద్యుత్తు-నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు స్పష్టం చేశారు.

నివర్​ తుపాను నేపథ్యంలో బుధవారం రాష్ట్రం మొత్తానికి సెలవు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.

భారీ వర్షాలు..

నివర్​ తుపాను.. బుధవారం(నవంబర్​ 25న) తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర తమిళనాడు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఇప్పటికే చెన్నై సహా మరికొన్ని ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతుండగా... స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎటు చూసినా నీరే
తమిళనాడులో పరిస్థితి

ఇదీ చూడండి:-'హిందువా.. ముస్లిమా అనవసరం- మేజర్లా.. కాదా?'

ABOUT THE AUTHOR

...view details