Woman living in broken house: ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్‌లోని కమ్సాల్కు చెందిన 28 ఏళ్ల పూనం దేవి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రకృతి విపత్తే ఆమెకు నిలువు నీడ లేకుండా చేసింది. భారీ వర్షాల కారణంగా ఇల్లు పూర్తిగా దెబ్బతిని నిరాశ్రయురాలైంది. గత్యంతరం లేక శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే ఇద్దరు పిల్లలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది.
భారీ వర్షాల కారణంగా పూనం దేవి ఇల్లు జనవరి 6న కూలిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇతరులు ఆశ్రయం కల్పించారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేక ఆమె మళ్లీ కూలిపోయిన ఇంట్లోకే తిరిగివచ్చింది. గోడకు పగుళ్లు, పైకప్పు లేక ఇల్లు శిథిలావస్థలో ఉంది. వేరే గత్యంతరం లేక ఇంటిపై ప్లాస్టిక్ కవర్‌ను కప్పి ఇద్దరు పిల్లలతో కలిసి అందులోనే జివిస్తోంది. ఉదయం వేళ చలి, రాత్రి వేళ వన్యప్రాణులు ఏమైనా వస్తాయనే భయంతో రోజూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది.
Rudraprayag news
క్యాన్సర్‌తో భర్త మృతి..
క్లీనర్‌గా పని చేసే పూనం దేవి భర్త ధర్మేంద్ర రాణా.. ఏడేళ్ల క్రితం క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. దంపతులు కూడ బెట్టుకున్న డబ్బంతా చికిత్సకే ఖర్చయింది. భర్త మరణం తర్వాత పూనందేవికి కష్టాలు మొదలయ్యాయి. నాలుగేళ్ల క్రితం పూనందేవి మామ కూడా కుటుంబం నుంచి వేరుపడ్డాడు. దీంతో ఆమె ఒంటరై కష్టాల చట్రంలో చిక్కుకుపోయింది. తనకు సాయం చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. రేషన్ కార్డు కూడా అత్తామామల పేరు మీద ఉన్నందున దాని ప్రయోజనం ఆమె పొందలేకోపోతోంది.