Police Dog Finds Missing Child : తప్పిపోయిన ఆరేళ్ల బాలుడి ఆచూకీని కనిపెట్టింది ఓ కుక్క. కేవలం 90 నిమిషాల్లోనే ఆ బాలుడి జాడను గుర్తించింది 'లియో' అనే పోలీసు శునకం. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది. బాలుడి జాడను గుర్తించిన 'లియో'పై పోలీసులతో సహా స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదీ జరిగింది
పొవాయ్ అంధేరీలోని కేబీఎం కాంపౌండ్ స్లమ్ ప్రాంతంలో నివసిస్తున్న విమల పూల్‌చంద్ కోరి అనే మహిళ కుమారుడు ఆరేళ్ల వివేక్ పుల్చంద్ కోరి తప్పిపోయాడు. నవంబర్ 23న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటూనే.. ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి ఇంటి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా.. బాలుడి ఆచూకీ లభించలేదు. అనంతరం తన ఆరేళ్ల కుమారుడు కనిపించటం లేదని పోవాయ్ పోలీస్ స్టేషన్లో విమల ఫిర్యాదు చేసింది.
బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ బ్రాంచ్ బృందం సహా పోవాయ్ పోలీసులు కలిసి మూడు బృందాలుగా ఏర్పడి బాలుడిని వెతకడం ప్రారంభించారు. మరోవైపు ప్రధాన కంట్రోల్ రూం, ట్రాఫిక్ పోలీసులను బాలుడి ఆచూకీ కోసం అప్రమత్తం చేశారు. అయితే, ఈ ఘటన జరిగిన ప్రాంతం స్లమ్ ఏరియా కావడం వల్ల సీసీటీవీ కెమెరాలు లేవు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు పోలీసులు. పోలీస్ శుకనం 'లియో'ను బాలుడి ఇంటికి తీసుకెళ్లి.. తప్పిపోయిన రోజు వివేక్ ధరించిన టీషర్ట్ ఆధారంగా గాలించడం ప్రారంభించారు. రంగంలోకి దిగిన లియో.. టీషర్ట్ ఆధారంగా నవంబర్ 24న తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అశోక్ టవర్ పరిధిలోని అంబేద్కర్ ఉద్యాన్ వద్ద బాలుడు జాడను గుర్తించింది.