తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీ అమెరికా షెడ్యూల్‌ ఖరారు.. ఐరాసలో యోగా.. వైట్‌హౌస్‌లో ఆతిథ్యం - narendra modi un

PM Modi US Visit : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు పర్యటనలకు షెడ్యూల్‌ ఖరారైంది. జూన్​ 20 నుంచి 25 వరకు ఈ రెండు దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం సహా బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. బైడెన్‌ దంపతుల ఆతిథ్యం స్వీకరించనున్నారు. జూన్​ 24, 25 తేదీల్లో మోదీ ఈజిప్టులో పర్యటించనున్నారు.

narendra modi us visit
narendra modi us visit

By

Published : Jun 16, 2023, 12:51 PM IST

PM Modi US Visit : ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. జూన్​ 20 నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్టు దేశాల్లో మోదీ పర్యటించనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. జూన్‌ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని 9 ఏళ్ల క్రితం ఇదే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీతొలిసారి ప్రతిపాదించారు. ఆ తర్వాత ఐరాస ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రతి ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని 2014 డిసెంబర్‌లో ఐరాస సాధారణ సభ తీర్మానం చేసింది. జూన్‌ 21న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు న్యూయార్క్‌లో ఈ యోగా సెషన్‌ జరగనుంది. ఇందులో ఐరాస ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొననున్నారు.

Narendra Modi US Tour: అనంతరం ప్రధాని మోదీ వాషింగ్టన్​​ వెళ్లనున్నారు. జూన్‌ 22న శ్వేతసౌథంలో మోదీకి స్వాగతం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అదే రోజు సాయంత్రం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌.. మోదీకి అధికారిక విందు ఇవ్వనున్నారు. జూన్‌ 22వ తేదీనే అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.

జూన్‌ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలిసి ప్రధానికి ఆతిథ్యమివ్వనున్నారు. వాషింగ్టన్‌లో అధికారిక కార్యక్రమాలతో పాటు పలు భేటీల్లో మోదీ పాల్గొననున్నారు. కంపెనీల సీఈవోలు, పలు రంగాల నిపుణులతో ఆయన చర్చలు జరపనున్నారు. ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు. అమెరికా పర్యటన నుంచి ప్రధాని నేరుగా ఈజిప్టు వెళ్లనున్నారు. జూన్‌ 24, 25 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశానికి వెళ్లనుండటం ఇదే తొలిసారి. జనవరిలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోదీ ఈజిప్టు వెళ్తున్నారు. సిసితో ద్వైపాక్షిక చర్చలు సహా పలువురు ఈజిప్టు ప్రముఖులు, భారత సంతతి ప్రజలతో మోదీ భేటీ కానున్నారు.

ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన..
ఈ ఏడాది మేలో ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ఆ దేశ ప్రధాని ముందు ప్రస్తావించారు నరేంద్ర మోదీ. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే చర్యలను సహించకూడదని స్పష్టం చేశారు. గతంలోనూ ఈ విషయంపై ఆసీస్ ప్రధానితో తాను చర్చించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్​కు కృతజ్ఞతలు తెలిపారు. అల్బనీస్​తో ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details