PM Modi On Congress :కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ.. ఉగ్రవాదం, మహిళలపై దౌర్జన్యాలు, పేట్రేగిపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. బుజ్జగింపు విధానాలతో కాంగ్రెస్ పార్టీ.. సంఘ వ్యతిరేక శక్తులను పెంచిపోషించి రాజస్థాన్‌ను నేరాలు, అల్లర్లలో దేశంలోనే అగ్రస్థానానికి పంపిందని ఆరోపించారు. మహిళలు తప్పుడు అత్యాచారం కేసులు పెడతారని సీఎం అశోక్ గహ్లోత్ అన్నారనీ.. అలాంటి వారు మహిళలను కాపాడతారా అని మోదీ ప్రశ్నించారు.
రాజస్థాన్ అంటే పురుషుల భూమి కాబట్టి అత్యాచారాలు తప్పక జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతీ పండగ సమయంలో అల్లర్లు, రాళ్ల దాడులు జరుగుతున్నాయని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం, మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం.. "మోదీ ఇచ్చే గ్యారెంటీల"ని ప్రధాని స్పష్టం చేశారు. మహిళల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని.. ఇటువంటి కారణాల వల్లే సీఎం అశోక్ గహ్లోత్‌కు ఓట్లు పడవని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 'మాంత్రికుడి (సీఎం గహ్లోత్)'కి ఓట్లు వేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. దీంతో డిసెంబరు 3న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాయమైపోతుందని అన్నారు.
"రాళ్లదాడులు, కర్ఫ్యూలు రాజస్థాన్‌లో నిత్యకృత్యంగా మారాయి. కాంగ్రెస్ ఎక్కెడెక్కడ గెలుపొందుతుందో అక్కడక్కడ ఉగ్రవాదులు, నేరగాళ్లు ఉంటారు. కాంగ్రెస్‌కు బుజ్జగింపులే సర్వస్వం. దాని కోసం ఎంతకైనా దిగజారుతుంది. ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోంది. మరోవైపు గత ఐదేళ్లలో రాజస్థాన్.. అవినీతి, అల్లర్లు, నేరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ తన బుజ్జగింపు విధానాలతో నేరస్థులకు స్వేచ్ఛనిస్తోంది. ఇందుకోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడదు."
-నరేంద్రమోదీ, భారత ప్రధాని