Dynasty politics: ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దానిపై అంతా కలిసికట్టుగా పోరాడాలని భాజపా ఎంపీలకు సూచించారు. భాజపా నేతల్లో కొంతమంది పిల్లలకు టికెట్లు కేటాయించకపోవడానికి కూడా కారణం ఇదే అని మోదీ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ రాలేదంటే అందుకు పూర్తి బాధ్యత తనదే అని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లో వారసత్వ రాజకీయాలపై పోరాడాలంటే ముందు సంస్థాగతంగా మనం దాన్ని అనుసరించాలని సూచించారు. దిల్లీలో నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈమేరకు మాట్లాడారు.
BJP parliamentary meeting
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు గానూ భాజపా నేతలు మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను సన్మానించారు. ఇద్దరికీ గజమాల వేసి సత్కరించారు.
ది కశ్మీర్ ఫైల్స్‌పై ప్రశంసలు..
ఇటీవల విడుదలై బాలీవుడ్లో సంచలనం సృష్టించిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సినిమాలు తరచూ రావాలని ఆకాంక్షించారు. చరిత్రను ప్రజలకు తెలియజేసే విషయంలో చిత్రపరిశ్రమ పాత్రను మోదీ ప్రస్తావించారు. భావప్రకటనా స్వేచ్ఛను కూడా కొందరు వ్యక్తపరచనివ్వడం లేదని విమర్శించారు.
"పుస్తకాలు, సాహిత్యం, కళల ద్వారానే కాదు.. సినిమాల ద్వారా కూడా చరిత్రను కళ్లకుగట్టవచ్చు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది. వారిపై సినిమాలను రూపొందించారు. కానీ జాతిపిత మహాత్మా గాంధీ కథపై సినిమాలు రాలేదు. హాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కితే దానికి అవార్డులు వచ్చాయి. అప్పుడే గాంధీ గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు ఇంకా ఎక్కువ తెలిసింది. ఎమర్జెన్సీ వంటి అంశాలపై సినిమాలు రావాల్సింది. కానీ కొందరు వాటిని తెరకెక్కనివ్వలేదు. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి దేశమంతా చర్చిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా కొందరు అడ్డుపడుతున్నారు. నిజానిజాలను తెలుసుకోవాల్సింది పోయి అపకీర్తి పాలు చేసేందుకు ప్రచారాలు చేస్తున్నారు."