Parliament Session Sine Die :చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అనంతరం పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌కు ఒకరోజు ముందుగానే రాజ్యసభను.. సభాపతి జగదీప్ దన్‌ఖడ్ నిరవధికంగా వాయిదా వేశారు. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. ఈ బిల్లును సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది ఓటు వేసి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఛైర్మన్ జగదీప్ దన్‌ఖడ్.. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రధానమంత్రి పుట్టినరోజు కావడం యాధృచికమన్నారు.
లోక్‌సభ నిరవధిక వాయిదా
అంతకుముందు లోక్‌సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. చంద్రయాన్ 3 విజయంపై తీర్మానం అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. సభ దాదాపు 31 గంటల పాటు జరగగా.. 132 శాతం ఉత్పాదకతను నమోదు చేసిందని ఓం బిర్లా తెలిపారు. సెప్టెంబర్ 19న సభ ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై 9 గంటల 57 నిమిషాల పాటు చర్చ జరిగిందని వెల్లడించారు. ఈ చర్చలో 32 మంది మహిళా ఎంపీలు సహా 60 మంది పాల్గొన్నారని వివరించారు.
మోదీ నడిచి వస్తుండగా ఇరువైపులా నిలబడి మహిళా ఎంపీల ధన్యవాదాలు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం... దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కీలక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బిల్లు కేవలం చట్టం కాదన్న ప్రధాని.. ఇది మన దేశాన్ని తయారు చేసిన అసంఖ్యాక మహిళలకు నివాళి అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్టీలకు అతీతంగా "నారీ శక్తి వందన్ అధినియమ్" బిల్లుకు ఓటు వేసిన రాజ్యసభ ఎంపీలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత.. పార్లమెంట్ భవనం వెలుపల మహిళా ఎంపీలతో ప్రధాని ఫొటో దిగారు. మోదీ నడుస్తూ వస్తుండగా.. మహిళా ఎంపీలు ఇరువైపులా నిలబడి చప్పట్లు కొట్టారు. రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆమోదం పొందడం పట్ల బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన నేతలు.. లింగ సమానత్వం, సమ్మిళిత పాలన అనే శక్తిమంతమైన సందేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచ వ్యాప్తంగా పంపారని అన్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం వల్ల బీజేపీ ఎంపీ రామ్ మోకారియా మిఠాయిలు పంచారు.