తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత జలాల్లో పాక్ పడవ.. రూ.300 కోట్ల డ్రగ్స్, గన్స్​తో అనుమానాస్పదంగా..

ఆయుధాలు, మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవను కోస్టుగార్డు అధికారులు సీజ్ చేశారు. 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పడవలో 40 కేజీల డ్రగ్స్ దొరికాయని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.300 కోట్లు ఉంటుందని చెప్పారు.

pakistani-boat-apprehended
pakistani-boat-apprehended

By

Published : Dec 26, 2022, 7:42 PM IST

Updated : Dec 26, 2022, 8:14 PM IST

భారత సముద్ర జలాల్లో ఆయుధాలతో సంచరిస్తున్న పాకిస్థాన్ పడవను కోస్టుగార్డు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) ఇచ్చిన సమాచారంతో పాక్ పడవతో పాటు అందులో ఉన్న పది మంది సిబ్బందిని పట్టుకున్నారు. పడవలో 40 కిలోల మాదకద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.300 కోట్లు ఉంటుందని చెప్పారు. ఆరు పిస్తోళ్లు, 120 రౌండ్ల బుల్లెట్లు సైతం దొరికాయని తెలిపారు.

కోస్టుగార్డు అదుపులో పాక్ జాతీయులు

నిఘా వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 25 అర్ధరాత్రి తర్వాత కోస్టుగార్డు.. ఐసీజీఎస్ అరింజయ్ పెట్రోలింగ్ నౌకను సముద్రంలో మోహరించింది. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద నిఘా పెట్టింది. డిసెంబర్ 26న తెల్లవారుజామున పాక్​కు చెందిన మత్స్యకారుల పడవ అల్​ సోహెలీ అనుమానాస్పదంగా సంచరించడం కోస్టుగార్డు గమనించింది. క్రమంగా ఆ పడవ భారత జలాల్లోకి ప్రవేశించింది. వారిని భారత ఐసీజీ పడవ హెచ్చరించినప్పటికీ.. సమాధానం చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేసింది. హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినా.. పాక్ పడవ ఆగలేదు.

పాకిస్థాన్ పడవను అడ్డుకుంటున్న కోస్టుగార్డు సిబ్బంది

దీంతో ఐసీజీ బృందం పాక్ పడవను నిలువరించి.. అందులోకి ప్రవేశించింది. వారిని విచారించగా అనుమానాస్పద రీతిలో సమాధానాలు చెప్పారు. వెంటనే అధికారులు.. పడవను పరిశీలించారు. దీంతో డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కనిపించాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ఓఖా ప్రాంతానికి తరలించాయి.
తాజా ఆపరేషన్​తో కలిపి.. గడిచిన 18 నెలల్లో కోస్టుగార్డు, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా ఏడు ఆపరేషన్లు నిర్వహించిందని అధికారులు తెలిపారు. మొత్తంగా రూ.1,930కోట్ల విలువైన 346 కేజీల హెరాయిన్​ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. 44 మంది పాకిస్థాన్, ఏడుగురు ఇరాన్ దేశీయులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

Last Updated : Dec 26, 2022, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details