పార్టీ బలోపేతం కోసమని భాజపా చేసిన పనే బంగాల్‌లో ఆ పార్టీకి గుదిబండగా మారేలా ఉంది. ఇతర పార్టీల నుంచి ఇబ్బడిముబ్బడిగా వచ్చిన వారికి పాత వారితో పొసగక అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఇక అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత... పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని స్వయంగా భాజపా నేతలే అంటున్నారు. 294 సీట్లకు 8 వేల మంది పోటీలో ఉండడమే వారి ఆందోళనకు కారణం. బలోపేతం కోసమని ఇతర పార్టీల నుంచి అవినీతిమరకలున్న వారిని కూడా ఆహ్వానించడంతో భాజపా సచ్ఛీలతే ప్రమాదంలో పడిందని ఆ పార్టీ సీనియర్లే ఆవేదన చెందుతున్నారు.
కొద్ది సంవత్సరాలుగా బంగాల్‌లో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటూ వస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాలీ గడ్డపై అస్తిత్వాన్ని రుజువు చేసుకున్న కమలనాథులు... ఆ తర్వాత తమ గురి ముఖ్యమంత్రి పీఠంపై పెట్టారు. అందులో భాగంగానే దీదీ రహిత బంగాల్ నినాదంతో కొద్ది నెలలుగా పశ్చిమబంగలో పావులు కదుపుతూ వచ్చారు. మమతాబెనర్జీ పార్టీ టీఎంసీ నుంచి వచ్చే వాళ్లందరికీ భాజపా గేట్లు బార్లా తెరిచి ఉంచింది. టీఎంసీ నుంచి వరదలా వచ్చి కమలతీర్థం పుచ్చుకొన్నారు. తద్వారా భాజపాకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం పెరుగుతుందని అంచనా వేసిన అధినాయకత్వానికి ఇప్పుడు వీధిపోరు కంటే ఇంటిపోరే అధికమైందంటున్నారు. ఏళ్లుగా భాజపాలో ఉంటూ పార్టీ కోసం ఎవరితో ఐతే నిత్యం ఘర్షణ పడుతూ వచ్చారో వాళ్లతోనే నేడు చేయికలపాల్సి రావడం పాత వారికి ఇబ్బందిగా ఉంటోందని భాజపా వర్గాలే అంటున్నాయి.
ఇదీ చదవండి:బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం
మొదట్లో సత్ఫలితాలే....
ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇతర పార్టీల వారిని చేర్చుకోవాలన్న ప్రణాళిక మొదట్లో సత్ఫలితాలే ఇచ్చింది. ఇప్పుడు మాత్రం పరిస్థితి వేరుగా ఉందని భాజపా నేత ఒకరు తెలిపారు. టీఎంసీని మునిగిపోయే పడవన్న ముద్ర వేసిన భాజపా ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోందని అన్నారు. అంతేకాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పుకొనే భాజపా... చాలా మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలోకి ఆహ్వానించడంతో సచ్ఛీలపార్టీ అనే ముద్ర పోగొట్టుకునే ప్రమాదంలో పడిందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ పసిగట్టిన కమలనాథులు ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరికలను నిలిపేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 294 సీట్లున్న బంగాల్‌లో దాదాపు 8 వేల మంది భాజపా నుంటి టికెట్ ఆశావహులు ఉన్నారంటేనే సీట్ల పంపకం అధినాయకత్వానికి ఎంత పెద్ద చిక్కో వేరే చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే రోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి పాత-కొత్త నాయకుల మధ్య కీచులాట్ల వార్తలు వస్తూనే ఉన్నాయని బంగాల్ భాజపా నేతలు చెబుతున్నారు. ఇక అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పరిస్థితి మరీదారుణంగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు.
అయితే.. పార్టీ పట్టు పెంచుకోవడానికి చేరికలు తప్పనిసరి కాబట్టే అలా చేశామని భాజపా బంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెబుతున్నారు. భాజపా ఓ పెద్ద కుటుంబమని అందులో ఇలాంటి చిన్న చిన్న గిల్లికజ్జాలు సహజమని చెప్పారు. ఇతర పార్టీల నుంచి రాకుంటే ఎలా బలపడగమని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా నిబంధనలకు లోబడే ఉండాలని గీత దాటితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అయితే భాజపా బంగాల్ శాఖలోని అనేక మంది నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ వాదులు కూడా ఇతర పార్టీల నుంచి కొందరి చేరికలను తప్పుపడుతున్నారు.