తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒమిక్రాన్ వల్లే దేశంలో మూడోవేవ్- ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి!

Omicron variant in India: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఈ వేరియంటే కారణమని నిపుణులు తేల్చారు. మరోవైపు, ఫిబ్రవరిలో కరోనా ప్రస్తుత వేవ్ తీవ్ర స్థాయికి చేరుకుంటుందని, రోజుకు ఐదు లక్షల కేసులు బయటపడే అవకాశం ఉందని అమెరికా వైద్య నిపుణుడు అంచనా వేశారు.

Omicron variant India
Omicron variant India

By

Published : Jan 8, 2022, 6:19 PM IST

Omicron variant in India:వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్లే అన్ని రాష్ట్రాల్లో మూడోవేవ్ సంభవించిందని అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం వరకు బంగాల్, ఛత్తీస్​గఢ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో డెల్టానే ప్రధాన వేరియంట్​గా ఉందని, పశ్చిమ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాపించిందని చెప్పారు. అయితే, తాజా గణాంకాల ప్రకారం.. అన్ని ఈశాన్య రాష్ట్రాలూ పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులను గుర్తిస్తున్నాయని వివరించారు.

రోజుకు ఐదు లక్షల కేసులు

India third wave peak stage: ఫిబ్రవరి నాటికి భారత్​లో కొవిడ్ మూడో వేవ్ తీవ్ర స్థాయికి చేరుతుందని అమెరికా వైద్య నిపుణుడు, 'హెల్త్ మెట్రిక్ ఇన్​స్టిట్యూట్ డైరెక్టర్' డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే అంచనా వేశారు. రోజుకు ఐదు లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని లెక్కగట్టారు. అయితే, డెల్టాతో పోలిస్తే ఈ వేరియంట్ ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పారు. తీవ్రమైన వ్యాధి నుంచి వ్యాక్సినేషన్ కాపాడుతుందని తెలిపారు.

"ఒమిక్రాన్ ప్రభావం డెల్టాతో పోలిస్తే 90 నుంచి 95 శాతం తక్కువగానే ఉంటుంది. 85.2 శాతం కేసుల్లో లక్షణాలు ఉండవని అనుకుంటున్నాం. డెల్టా సమయంలో నమోదైన ఆస్పత్రి చేరికలతో పోలిస్తే మూడోవేవ్​లో నాలుగో వంతు మాత్రమే ఉంటాయని అంచనా. అయితే, కొంతమంది వృద్ధులు ఒమిక్రాన్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉంది."

-క్రిస్టోఫర్ ముర్రే, అమెరికా వైద్య నిపుణుడు

ఆందోళనకరంగా 'ఆర్​నాట్'

R naught value of Omicron:మరోవైపు, గత రెండు వారాల కొవిడ్‌ కేసులను విశ్లేషించిన ఐఐటీ మద్రాస్‌ బృందం.. తాజాగా కీలక విషయాలు వెల్లడించింది. కంప్యూటేషనల్ మోడలింగ్ ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. దేశంలో 'ఆర్‌నాట్‌' విలువ డిసెంబర్ 25- 31 మధ్య 2.9 ఉండగా.. జనవరి 1-6 మధ్య ఏకంగా 4గా నమోదైందని తెలిపింది. దేశంలో మహమ్మారి రెండో వేవ్ పీక్‌ దశలో నమోదైన 1.69 కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని 'ఆర్‌నాట్‌'గా పేర్కొంటారు. ఈ విలువ ఒకటి దాటడం ఏమాత్రం సానుకూల పరిణామం కాదని నిపుణులు చెబుతుంటారు. గత బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ సైతం దేశ ఆర్‌నాట్ విలువ 2.69గా ఉందని తెలిపింది.

India covid news

Omicron variant news latest

దేశంలో ప్రస్తుత వేవ్‌.. ఫిబ్రవరి 1-15 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఈ బృందం అంచనా వేసింది. ఐఐటీ మద్రాస్‌ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా ఈ విషయమై మాట్లాడుతూ.. ఆర్‌నాట్ అనేది సంక్రమణ సంభావ్యత, కాంటాక్ట్‌ రేటు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే.. క్వారంటైన్‌ నిబంధనలు, ఆంక్షల విధింపు కారణంగా కాంటాక్ట్ రేట్ తగ్గి, ఆర్‌నాట్‌ విలువా పడిపోవచ్చన్నారు. ఆర్‌నాట్‌ విలువ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన దానికంటే భిన్నంగా ఉండటంపై వివరణ ఇస్తూ.. ఈ రెండు అంచనాలు వేర్వేరు టైం ఇంటర్వెల్‌పై ఆధారపడి ఉన్నాయని, తాము కేవలం గత రెండు వారాలకు సంబంధించిన వివరాలపై ప్రాథమిక విశ్లేషణ చేసినట్లు చెప్పారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ రేటు, మొదటి రెండు వేవ్‌లతో పోల్చితే ఈసారి తక్కువ సామాజిక దూరం పాటిస్తుండటం వంటి కారణాలతో.. ప్రస్తుత వేవ్‌ మునుపటివాటి కంటే భిన్నంగా ఉంటుందని ఝా వెల్లడించారు. ఈసారి జనాభాలో దాదాపు 50 శాతం మందికి టీకాలు పూర్తికావడం కూడా కలిసొచ్చే అంశమని చెప్పారు.

లక్షకు పైగా కేసులు

India covid cases today:దేశంలో వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21 శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3 వేల పైనే ఉన్నాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. నిన్న 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి:సీబీఐ కార్యాలయంలో 68 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details