odisha student covid: ఒడిశాలో కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా.. దెంకనల్‌లోని కుంజకంట ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ కాలేజీలో 33మంది బాలికలకు కొవిడ్ సోకినట్టు తేలింది.
తొలుత.. కాలేజీలోని నలుగురికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించారు. ఇందులోనే కొవిడ్ కేసులు బయటపడ్డాయి.
కరోనా విజృంభణ నేపథ్యంలో కాలేజీని పూర్తిగా మూసివేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. కాలేజీని పూర్తిగా శానిటైజ్ చేశారు.
గత వారం..
ఒడిశా రాయ్‌రంగ్‌పుర్ జిల్లాలో 26మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. మయూర్‌భంజ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 259 విద్యార్థులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్దఎత్తున కేసులు బయటపడటం వల్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. పాఠశాల వద్ద అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితే తలెత్తితే వెంటనే బాధితులను తరలించేందుకు అంబులెన్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాలకు వస్తున్న బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు గమనించారు. బాధిత విద్యార్థులకు గత గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా 26మందికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ పాఠశాల ప్రాంగణంలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.