అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారిన నివర్.. తీరం దాటిన తర్వాత మరింతగా బలహీనపడుతోంది. ఈ ఉదయం తీరం దాటిన నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని తాంబరంలో అత్యధికంగా 31.4 సెంటీమీటర్లు, విల్లుపురంలో 28 సెం.మీ. వర్షం కురిసింది.
ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుపాను కారణంగా.. చెన్నైలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఇక్కట్లు పడ్డారు. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు.
దాదాపు 2.27 లక్షల మంది ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
తప్పిన గండం..
నివర్ తుపాను బలహీనపడుతుండటం వల్ల చెన్నై ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆ ప్రభావం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.