కర్ణాటక గడగ్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చేసిన దాడిలో నాలుగో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని తొమ్మిదేళ్ల భరత్ బారాకెరీగా గుర్తించారు.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు ముత్తు హడాలీ ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. శనివారం.. స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో భరత్‌ను ఐరన్ రాడ్డుతో కొట్టాడు ముత్తు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వెళ్లాడు బాలుడు భరత్. జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పాడు. దీంతో భరత్ తల్లి గీత.. ఉపాధ్యాయుడిని నిలదీసేందుకు స్కూల్‌కు వెళ్లింది. అప్పుడు ఆమెపైనా దాడికి యత్నించాడు ముత్తు.
తర్వాత, బాలుడిని హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం నిందితుడు ముత్తు పరారయ్యాడు. మృతుడి తల్లి గీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.