- దిల్లీలో రూ.100 కోట్ల మాదక ద్రవ్యాల పట్టివేత
- పంజాబ్‌లో రూ.30 కోట్ల హెరాయిన్ స్వాధీనం
- గుజరాత్లో రూ.1439 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ఇవన్నీ దేశంలో తాజాగా డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు.. ఇంతలా డ్రగ్స్ లభ్యమవడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? ఏదైనా మాఫియా ఉందా? లేక ఉగ్రవాదం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతుండగా.. అవుననే సమాధానం ఇస్తున్నారు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్. తాజాగా జరుగుతున్న ఘటనలు నార్కో టెర్రరిజానికి (మాదక ద్రవాల ఉగ్రవాదం) అవకాశం ఉందంటున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను తొలగించడానికి పటిష్ఠమైన చట్టాన్ని అమలు చేయాల్సి ఉందని ఉద్ఘాటించారు.
దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం అధికం కావడం వల్ల దానిని ఆసరాగా తీసుకుంటున్నాయి ఉగ్రవాద సంస్థలు. డ్రగ్స్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి భారత్‌కు సరఫరా చేస్తున్నాయి. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. సముద్ర, భూ సరిహద్దు మార్గాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నారు. వివిధ వస్తువుల్లో హెరాయిన్‌ను దాచి అక్రమంగా భారత్‌కు తరలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలో భారత్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే అఫ్గానిస్థాన్ డ్రగ్స్ రాకెట్‌ను పట్టుకున్నారు అధికారులు. వీరి వద్ద నుంచి రూ. 30 లక్షల నగదు, 47 కిలోల మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
"పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి డ్రగ్స్ అక్రమంగా సరఫరా అవుతున్నాయి. ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులు పట్టుబడుతున్నారు. దీని వెనుక నార్కో టెర్రరిజానికి అవకాశం ఉంది. దీనిపై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆధ్వర్యంలో నల్లమందు విరివిగా సాగు చేసేవారు. కానీ అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఇటీవలే నల్లమందు సాగుపై నిషేధాన్ని ప్రకటించింది. నిషేధాన్ని ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. విదేశాల్లో తయారుచేసి అక్రమ రవాణా చేస్తున్నారు."