Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. చార్‌ధామ్ యాత్రికులతో వెళుతున్న బస్సు ఒకటి 200 మీటర్ల లోతు లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో డ్రైవరు, ఓ సహాయకుడు, 28 మంది యాత్రికులున్నారు. ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతంలోని యమునోత్రి ఎన్‌హెచ్-94పై ఈ దుర్ఘటన జరిగింది.
యాత్రికులంతా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో పడిన తర్వాత బస్సు రెండు భాగాలుగా విడిపోయినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద స్థలానికి వైద్యుల బృందంతోపాటు అంబులెన్సులు తరలించినట్లు జిల్లా కలెక్టర్ అభిషేక్ రుహేలా తెలిపారు. క్షతగాత్రులను డామ్టా, నౌగావ్‌లలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. పన్నా వాసులు మూడు బస్సుల్లో చార్‌ధామ్ యాత్రకు బయలుదేరగా.. ఇందులో ఒక బస్సు ప్రమాదానికి గురైంది.
సీఎం దిగ్భ్రాంతి..యమునోత్రికి వెళ్తూ బస్సు లోయలోపడిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బస్సు స్టీరింగ్ ఫెయిల్ అవ్వడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన నలుగురికి ఉచితంగా చికిత్స చేస్తున్నామని, దాంతో పాటు రూ.50 వేలు నగదు ఇస్తామని చెప్పారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.