Roorkee gangrape: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక, ఆమె తల్లిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. కారులోనే వీరిపై అత్యాచారం చేశారు దుండగులు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పిరన్ కలియార్కు చెందిన మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రూడ్కీకి వెళ్తున్నారు. దారిలో ఆమె ఓ కారును ఆపి లిఫ్ట్ అడిగారు. రూడ్కీలో దించేయాలని కోరగా.. నిందితులు ఎక్కించుకున్నారు. సోనూ అనే వ్యక్తి కారులో ఉన్నాడని.. అతడి స్నేహితులు కూడా లోపలే కూర్చున్నారని బాధిత మహిళ తెలిపారు. వీరంతా కలిసి దారిలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వివరించారు. తన కూతురిపైనా అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు.
నిందితులు కదులుతున్న కారులోనే అత్యాచారం చేసి.. అనంతరం రోడ్డుపై వదిలేసి పారిపోయారు. రక్తస్రావంతోనే తన కూతురిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది మహిళ. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షలు జరిపించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కారులో ఎంతమంది నిందితులు ఉన్నారనేది మహిళ చెప్పలేదు. సోనూ పేరు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం రాత్రంతా వెతికినట్లు పోలీసులు చెప్పారు. అయితే, వారి జాడ తెలియలేదని సమాచారం. ఆ మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలోనూ ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది.