Modi 20 book: ప్రధాని నరేంద్ర మోదీ.. కలలను సాకారం చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నాయకుడని కొనియాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 'మోదీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ' పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమక్షంలో దిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీపై సరైన విశ్లేషణను పుస్తకంలో సమర్థంగా అందించారని రచయితలపై ప్రశంసలు కురింపించారు. ఒక దిగ్గజ నాయకుడి 20 సంవత్సరాల ప్రయాణాన్ని రచయితలు అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు వెంకయ్య.
"ఈ పుస్తకం అరుదైన సంకలనం. ఇది ఆధునిక భారత్లోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరి పరిణామాన్ని పాఠకులకు అందిస్తుంది. ప్రధాని మోదీ జాతీయ స్థాయిలో ఒక అద్భుతం. ఈ పుస్తకం విలక్షణమైన ఆలోచనా ప్రక్రియ విభిన్న కోణాలను, మార్గదర్శకత్వం, అనుకూల, చురుకైన విధానం, పరివర్తనాత్మక నాయకత్వ శైలిని ప్రదర్శిస్తుంది. మోదీ ప్రయాణం, మాటలు, పనులు, కలలు, వాటి సాకారాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన దేశ ప్రజల కోసం ఎలా పెద్ద కలలు కనగలుగుతున్నారు. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఆ కలలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం సాయం చేస్తుంది."
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
మోదీ నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ధి:ప్రధాని మోదీ 20 ఏళ్ల పరిపాలనపై ప్రశంసలు కురింపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం దేశాన్ని సమ్మిళిత అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందన్నారు. 'సమ్మిళిత అభివృద్ధి, వ్యక్తిత్వ మార్గాన్ని విశ్వసించిన వారు సామాజిక సేవ, రాజకీయాల్లో పని చేస్తారు. ఈ పుస్తకం భగవత్ గీతలా ప్రాచుర్యం పొందుతుంది. మోదీ చిన్న కార్యకర్త నుంచి అత్యంత ఆదరణ పొందిన నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని ఈ పుస్తకం తెలుపుతుంది. క్షేత్రస్థాయిలో ఆటోల్లో, బస్సుల్లో ప్రతి గ్రామానికి తిరిగిన వ్యక్తి మోదీ. పేద వారితో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయనకు కనీసం పంచాయతీని పాలించిన అనుభవం లేదు. కానీ, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించారు.' అని పేర్కొన్నారు షా.
8 ఏళ్ల మోదీ ప్రభుత్వం ఉగ్రవాదంపై అంతర్జాతీయ చర్చకు నేతృత్వం వహిస్తోందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఆయన అభివృద్ధి ఆధారిత దౌత్యం సహా భద్రతా సవాళ్లను అధిగమించేందుకు సరిహద్దులో మౌలిక వసతులపై దృష్టి సారించినట్లు చెప్పారు. వాణిజ్యంలోనూ ప్రత్యేక దృష్టితో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే
బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన అందాల రాశి!