నేపాల్‌కు చెందిన ఓ యువకుడు దిల్లీలో తప్పిపోయి 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. నేపాల్ నుంచి తన మామయ్యతో ఉపాధి కోసం దిల్లీ వచ్చిన క్రమంలో తప్పిపోయాడు. చాలా ఏళ్లుగా అతని కోసం కుటుంబ సభ్యులు వెతికారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కొద్ది రోజుల క్రితం ఆ యువకుడి గురించి నేపాల్ ఎంబసీకి సమాచారం అందింది. వివరాలు పరిశీలించిన తర్వాత నేపాల్‌లోని అతని కుటుంబంతో కలిపారు అధికారులు.
ఇదీ జరిగింది:నేపాల్‌కు చెందిన రవి అనే యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్‌తో కలిసి ఉపాధి కోసం దిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఆ తర్వాత వారు పని చేసే చోటు నుంచి రవి తప్పిపోయాడు. నోయిడా, దాద్రీ అటవీ ప్రాంతంలోని కోట్ గ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి ఆరోగ్యం క్షీణించింది. కోట్ గ్రామంలో ఉండే సంజయ్ అనే వ్యక్తి రవిని తన ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు. 22 ఏళ్ల పాటు వారితోనే ఉండిపోయాడు రవి. రెండున్నరేళ్ల క్రితం రవిని కొందరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌కు తీసుకెళ్లారు. దీంతో దాద్రీ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు సంజయ్. రవి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. రెండున్నరేళ్ల తర్వాత బాఘ్‌పత్‌లో గుర్తించారు. తిరిగి సంజయ్ కుటుంబానికి అప్పగించారు. ఈ క్రమంలోనే బాఘ్‌పత్‌కు చెందిన కొందరు రవి గురించి నేపాల్ ఎంబసీకి సమాచారం అందించారు. నాయిడాలోని కోట్ గ్రామంలో ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న నేపాల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రవి కుటుంబానికి సైతం సమాచారం అందించారు. వారు వెంటనే దిల్లీ చేరుకున్నారు. 27 ఏళ్ల తర్వాత దాద్రీ కొత్వాలీ పోలీసుల సాయంతో కోట్ గ్రామం నుంచి రవిని అతడి కుటుంబ సభ్యులతో తీసుకెళ్లారు నేపాల్ పోలీసులు.