MBBS Hindi: హిందీలో వైద్య విద్య బోధనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 13 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో చదవనున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలో మెడిసిన్‌ను బోధించనుంది. అటానమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పాఠాలను స్థానిక భాషలో చెప్పనుంది. హిందీలోకి అనువదించిన ఈ పాఠ్యపుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేసి.. రాష్ట్రంలో హిందీలో వైద్య విద్యను ప్రారంభించనున్నారు. కాగా ఈ విద్యను స్థానిక అధికారిక భాషలో బోధించనున్న మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలువనుంది.
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను హిందీలో నేర్చుకోలేమని, బోధించలేమనే భావనను రూపుమాపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలం అనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని పేర్కొన్నారు. విద్యా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని సీఎం వ్యాఖ్యానించారు.