దక్షిణాఫ్రికా నుంచి భారత్‌లో అడుగుపెట్టిన సమయాన గాంధీజీ అంతగా ఎవ్వరికీ తెలియని దశ అది. ఆయన కూడా భారత్‌ను అర్థం చేసుకుంటున్నారప్పుడప్పుడే. శుక్లా అనే బిహారీ రైతు ఒత్తిడి మేరకు చంపారన్ ప్రాంతానికి చేరుకున్నారు బాపూజీ. చెప్పిన మాటలు విని బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయటం కాకుండా... స్వయంగా రైతుల సమస్యను అర్థం చేసుకోవాలని భావించారాయన. 1917 ఏప్రిల్‌లో చంపారన్‌లో నీలిమందు (ఇండిగో) పండిస్తున్న రైతులతో మాట్లాడటానికి మోతిహారికి చేరుకున్నారు గాంధీజీ.
వస్త్రాలకు సహజ అద్దకంగా వాడే నీలిమందుకు (gandhiji in champaran movement) అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న సమయమది. ఇందులో రైతులకు వచ్చే లాభం ఏమీ ఉండేది కాదు. పైగా ఈ పంట కారణంగా భూమి నిస్సారంగా తయారయ్యేది. కానీ భూస్వాములు, వస్త్రపరిశ్రమ యజమానులు ఒత్తిడి చేసి... రైతులతో నీలిమందు పంట తప్పనిసరిగా వేయించేవారు. అంగీకరించనివారికి రుణాలు దొరక్కుండా చేసేవారు. ఆంక్షలు విధించేవారు. పన్నులు పెంచేవారు. దీంతో రైతులు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా పంట వేయాల్సి వచ్చేది. తనకు కొత్తదైన ఈ వ్యవస్థను, రైతుల అవస్థలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు గాంధీజీ.
తొలిసారి ఓ నేత వచ్చి చంపారన్‌లో పర్యటిస్తుండటంతో.. నీలిమందు వ్యాపారులు, జమీందార్లు, భూస్వాముల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో నీలిమందు ప్లాంటేషన్ మేనేజర్ ఇర్విన్ అనే బ్రిటిషర్ ఓరోజు గాంధీజీని విందుకు ఆహ్వానించాడు. అంతకుముందే ఇర్విన్ తన వంటమనిషి బతక్‌మియాకు ఏం చేయాలో సూచించాడు. పాలల్లో విషం కలిపి ఇవ్వాలంటూ ఆదేశించాడు. ఈ పని చేస్తే భారీగా డబ్బులిస్తానని ఆశచూపించాడు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు కూడా.
విందుకు హాజరైన గాంధీజీకి వణుక్కుంటూనే గ్లాసు ఇచ్చిన బతక్‌మియా.. విషయం అర్థమయ్యేలా హెచ్చరించారు. అక్కడే ప్రత్యక్షసాక్షిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ బాపూజీని తీసుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అలా గాంధీజీ ప్రాణాపాయం నుంచి తప్పించుకొన్నారు. తర్వాత ఆయన సారథ్యంలో (gandhiji in champaran movement) చంపారన్ సత్యాగ్రహం చేయటం.. అది విజయవంతం కావటం.. రైతుల పరిస్థితిలో మార్పు రావటం.. తొలి సత్యాగ్రహంతో గాంధీజీ జాతీయ నేతగా ఎదగటం తదనంతర పరిణామాలు!