Man Stuck In 70 Feet Deep Pit Taken Out : పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో 70 అడుగుల లోతు ఉన్న గుంతలో చిక్కుకుపోయినవ్యక్తిని ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. 45 గంటలపాటు గుంతలో చిక్కుకుపోయిన అతడిని.. బయటకు తీసిన వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే?
జిల్లాలో కర్తార్‌పుర్‌లో దిల్లీ- జమ్ము-కట్‌ఢా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా బస్రంపుర్ గ్రామ సమీపంలో 70 అడుగుల లోతైన గుంతను తవ్వారు. బాధితుడు సురేశ్‌తోపాటు మరో వ్యక్తి పవన్.. శనివారం రాత్రి గుంతలోకి దిగారు. అదే సమయంలో పైన ఉన్న మట్టి దిబ్బలు ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో అప్రమత్తమైన పవన్ హుటాహుటిన బయటకు వచ్చాడు. సురేశ్ మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. శనివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నిరంతరాయంగా చర్యలు చేపట్టారు.
సుమారు 45 గంటల తర్వాత సోమవారం మధ్యాహ్నం.. గుంత నుంచి సురేశ్‌ను అధికారులు బయటకు తీశారు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. సురేశ్ చనిపోయినట్లు మరో వ్యక్తి చెప్పాడు. బాధితుడు.. హరియాణాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే బాధితుడు.. ఇంజినీర్ అంటూ వార్తలు వచ్చాయి. వాటిపై సురేశ్ సోదరుడు సత్యవాన్ స్పందించాడు. తన సోదరుడు ఇంజినీర్ కాదని చెప్పాడు.
బావిలో చిక్కుకుని కార్మికుడు మృతి
అంతకుముందు నెల రోజుల క్రితం ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. తిరువనంతపురంలో పైపులు దింపడానికి 100 అడుగుల బావిలోకి దిగి.. చిక్కుకుపోయి ఓ వ్యక్తి మరణించాడు. మట్టి పెళ్లలు పైన పడటం వల్ల 48 గంటలుగా బావిలోనే నరకయాతన అనుభవించాడు. అంతకుముందు వారి వద్ద ఉన్న పరికరాలతో బాధితుడ్ని బయటకు తీయడం సాధ్యం కాకపోవడం వల్ల.. ఇతర ప్రాంతాల నుంచి అధునాతన పరికరాలను తెప్పించారు. ఆ తర్వాత కొల్లాం నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మట్టి పెళ్లలు కూలకుండా చెక్కలను అడ్డం పెట్టారు. అతడిని కాపాడేందుకు సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు దాదాపు 48 గంటల తర్వాత మట్టిలో కూరుకుపోయిన తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల మహారాజన్ మృతదేహాన్ని వెలికితీశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి