Hatchery For Chicks: కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచం స్తంభించిపోయింది. ఫలితంగా ఎంతో మంది జీవనోపాధి కోల్పోయి బతకడమే కష్టమైపోయింది. కొందరు మాత్రం ఆ లాక్‌డౌన్‌ను అవకాశంగా మలుచుకున్నారు. కష్ట సమయంలో స్వయం ఉపాధి పొందారు. ఆ కోవకే చెందుతాడు కేరళ ఇడుక్కి జిల్లాలోని రాజకుమారి గ్రామానికి చెందిన అభిజిత్. లాక్డౌన్లో యూట్యూబ్ వీడియోలు చూసి.. కోడిపిల్లల ఉత్పత్తి యూనిట్ నిర్మించి స్వయం ఉపాధి పొందాడు. ఇప్పుడదే అభిజిత్‌ను పోషిస్తోంది.
అభిజిత్.. తొలుత కాలక్షేపం కోసం కోడి పిల్లల ఉత్పత్తికి సంబంధించిన వీడియోలు చూసేవాడు. తద్వారా ఆదాయం పొందవచ్చని గ్రహించాడు. వీడియోలో వారు చెప్పిన విధంగా హేచరీ (కోళ్ల ఉత్పత్తి కేంద్రం) యూనిట్ నిర్మించడానికి కావాల్సిన థర్మోస్టాట్, ఫ్యాన్, బల్బులు, హీటర్, టైమర్, మోటారు, వాటర్ ఫాగర్, పెద్ద పెట్టెను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. ఇంటి వద్దే హేచరీ యూనిట్ నిర్మించాడు. తద్వారా ఇప్పటివరకు 3,000కుపైగా కోడిపిల్లలను ఉత్పత్తి చేసినట్లు అభిజిత్ చెబుతున్నాడు.