Murder In Hyderabad: న్యాయాన్ని కాపాడే న్యాయస్థానం ముందే.. ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌లోని పాతబస్తీ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైకోర్టు సమీపంలో రోడ్డుపై ఒక వ్యక్తిని.. దుండగుడు దారుణంగా హత్య చేశాడు. హైకోర్టు గేట్ నం.6 సమీపంలో సులభ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న మిథున్ అనే వ్యక్తిని.. జనం చూస్తుండగానే కత్తితో దుండగుడు పొడిచి చంపాడు. రూ.10,000 విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో పండ్లు అమ్ముకునే వ్యక్తికి.. ఆ డబ్బులను ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ డబ్బుల విషయమై వారిరువురి మధ్య తరుచూ గొడవలు జరిగేవని చెప్పారు.
ప్రతిసారి డబ్బులు అడగడంతో ఆజంకు కోపం వచ్చి.. ఎలాగైనా చంపాలని భావించాడని వారు ఆరోపణలు చేశారు. అందుకే మిథున్‌ను తన బావమరిది ద్వారా గొడవకు పంపి.. హత్య చేసినట్లు సమాచారం. ఈఘటనపై సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ దారుణ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.