దేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన వేళ కొవిడ్ టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ల పంపిణీ సవాలుగా మారిందని, అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావాలని ఆ లేఖలో విన్నవించారు.
కరోనా రెండో దశ కారణంగా టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు టీకాలను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావాలని.. ఆసక్తిగల వారు త్వరితగతిన టీకాలు పొందేందుకు వీలుంటుందని లేఖలో వివరించారు.