తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేసవి తంటా.. నీళ్ల కోసం భయానక రీతిలో బావిలోకి దిగుతున్న మహిళలు

బిందెడు నీళ్ల కోసం ఆ గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారు. నాలుగు మంచి నీటి బావులున్నా.. దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బావిలో ఉన్న కొద్దిపాటి నీళ్ల కోసం మహిళలు భయానకంగా అందులోకి దిగుతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లాలో ఉంది ఆ గ్రామం.

maharashtra-water-crisis-people-facing-huge-water-problems-in-nashik-district-maharashtra
మహారాష్ట్రలో నీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రజలు

By

Published : May 15, 2023, 4:53 PM IST

వేసవి వచ్చిందంటే చాలు ఆ గ్రామ ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది. బిందెడు నీళ్ల కోసం పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. ఆ ఊరిలో నాలుగు మంచి నీటి బావులున్నా.. లాభం లేకుండా పోయింది. ఉన్న కొద్ది పాటి నీటిని తోడుకునేందుకు ప్రాణాల్నే పణంగా పెట్టాల్సి వస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా అమ్‌డోంగ్రా గ్రామస్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ గ్రామ ప్రజలు బిందెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. మహిళలు భయానక రీతిలో బావిలోకి దిగుతున్నారు. గ్రామంలో ఉన్న నాలుగు మంచి నీటి బావుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు అడుగంటిన నీటి కోసం మహిళలు ఎంతో కష్టంగా బావిలోకి దిగుతున్నారు. దొరికిన కొద్దిపాటి నీరు కూడా మట్టితో ఉండటం వల్ల వాటినే తాగి కాలం వెళ్లదీస్తున్నారు. తాగు నీటి సమస్య ఈ ఒక్క ఏడాదే మాత్రమే కాదని.. ప్రతి వేసవిలో తమకు ఇదే పరిస్థితి ఎదురవుతోందని వారు వాపోతున్నారు.

నీళ్ల కోసం బావిలోకి దిగుతున్న గ్రామస్థులు
నీళ్లు తోడుతున్న మహిళలు

అమ్‌డోంగ్రా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే దాదాజీ భూసే స్పందించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద గ్రామస్తులకు నల్లా ద్వారా తాగునీరు అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అప్పటిలోగా సమీప ప్రాంతాల నుంచి నీటి తెప్పించి బావుల్లో పోయిస్తామని చెప్పారు.

బావిలోకి దిగుతున్న మహిళ

దాహం తీరాలంటే రోజూ ఎండలో 2కిమీ నడవాల్సిందే..
మహారాష్ట్రలోనే.. అది కూడా నాసిక్​ జిల్లాలోనే బోర్దాపాడా గ్రామానికి చెందిన గిరిజనులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రతిరోజు సుమారు 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. దట్టమైన అడవుల్లో పెద్ద బండరాళ్ల మధ్య నుంచి ఇలా నిత్యం నీటి కోసం వీరు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇందుకోసం తల్లులతో కలిసి కూతుళ్లు.. అత్తలతో కలిసి కోడళ్లు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస నీటి అవసరాలను తీర్చుకునేందుకు ప్రతి రోజు మండుటెండలను సైతం లెక్కచేయకుండా నీటి కోసం యుద్ధం చేస్తున్నారు. ఇందుకోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు.

ప్లాస్టిక్​ డబ్బాలను బావిలోకి వదిలి వాటి ద్వారా బిందెల్లో నీటిని నింపుకుంటున్నారు. అలా అని ఆ నీరు సైతం సురక్షితమైనవా అంటే కాదనే చెప్పాలి. వాటిని శుద్ధి చేసేందుకు నీళ్లు వడకట్టే జాలితో పోసుకుంటూ.. వాటినే తాగుతున్నారు. అయితే గ్రామంలో ఉన్న నీటి బావులు ఇప్పటికే ఎండిపోయాయని.. ప్రస్తుతం తోడుకుంటున్న బావిలోని నీళ్లు కూడా 15 రోజుల్లో అయిపోతాయని గ్రామస్థులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తమ గ్రామ ప్రజల నీటి కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు ఇక్కడి వారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details