మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి నలుగురు మరణించారు. మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛతర్‌పుర్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
విషాదం మిగిల్చిన 'దిల్సే'
పరేతా గ్రామంలో షిటల్ అహిర్వర్(60) ఈ నెల 9న ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 150 మంది పాల్గొన్నారు. వారిలో కొందరు అక్కడికి దగ్గరగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ వైన్ షాప్ నుంచి 'దిల్సే' అనే బ్రాండ్ మద్యం కొనుగోలు చేసి తాగారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అహిర్వర్ కుమారుడు హరగోవింద్(40) ఈ నెల 12 మరణించగా.. తండ్రి మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం(ఫిబ్రవరి 14న) మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారినపడగా.. అతణ్ని గ్వాలియర్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.