తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​లో అదానీ- హిండెన్ బర్గ్ నివేదిక రచ్చ.. CJI పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న ఖర్గే - adani rajysabaha

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై ఉభయసభల్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. మరోవైపు, హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్​ చేశారు.​ ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలను ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.

LOK SABHA
LOK SABHA

By

Published : Feb 2, 2023, 11:23 AM IST

Updated : Feb 2, 2023, 3:04 PM IST

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం తలెత్తింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఉభయసభలు.. శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు గురువారం సమావేశమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంటను మొదలుపెట్టారు. అయితే అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక గురించి చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు ఈ విషయంపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే, ఇందుకు సభాపతి అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాల గంట చాలా ముఖ్యమైందని, సభ్యులు అంతరాయం కలిగించొద్దని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్‌.. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. ఉదయం 11 గంటలకు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభను ప్రారంభించగానే విపక్ష సభ్యులు ఆందోళన లేవనెత్తారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.

తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యాయి. అయినా ఎంపీలు తమ ఆందోళనలను విరమించకపోవడం వల్ల లోక్​సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్​ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభను కూడా రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్​ జగ్​దీప్​ ధన్​ఖడ్​ వెల్లడించారు.

సీజేఐతో దర్యాప్తు జరిపించాల్సిందే: ఖర్గే
అదానీ షేర్లు, హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరపించాలని లేదంటే.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్​ చేశారు.​ ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయలను ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. నిజానిజాలు తెలియాలంటే పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు.

అదానీ- హిండెన్​ బర్గ్​ నివేదిక వ్యవహారం.. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరామని బీఆర్ఎస్​ పార్టీ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. ఒక్కరోజులో అదానీ గ్రూప్​కు చెందిన 27 శాతం షేర్ల పతనమయ్యాయని అన్నారు. సభ ఆర్డర్​లో లేదని వాయిదా వేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అదానీ.. మోదీలాగే మాట్లాడుతున్నారు!: కాంగ్రెస్‌
హిండెన్‌బర్గ్‌ నివేదికతో వివాదం కొనసాగుతున్న వేళ.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20వేల కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ను వెనక్కి తీసుకుంది. దీనిపై తాజాగా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ స్పందించి ఇన్వెస్టర్లను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. అయితే ఈ ప్రసంగంపై కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. "నైతికత గురించి అదానీ మాట్లాడటం.. ఆయన గురువు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) వినయం, నిగ్రహం, విశాల హృదయం వంటి సద్గుణాలను బోధించడం లాంటిదే. ఇదంతా పొలిటికల్‌ సైన్స్‌" అంటూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ గతవారం అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది.

కేంద్ర మంత్రులతో మోదీ సమావేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్​కు కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, నిర్మలా సీతారామన్​, ప్రహ్లాద్ జోషి, పీయూశ్​ గోయల్, నితిన్​ గడ్కరీ, కిరణ్​ రిజుజు హాజరయ్యారు.

Last Updated : Feb 2, 2023, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details