Inspector asking woman to have sex: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు.. ఓ మహిళ(39) పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇస్తే లంచం ఇవ్వాలని, లేదంటే తన లైంగిక వాంఛ తీర్చాలని తన దుర్బుద్ధి చాటుకున్నాడు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.
Bengaluru woman complaint on Inspector
బెంగళూరులోని హెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వసంత్ కుమార్‌పై ఓ మహిళ ఈ ఆరోపణలు చేశారు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు జనవరి 13న పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు ఆమె చెప్పారు. తన పరిస్థితిని ఆసరాగా తీసుకొని పోలీస్ ఇన్స్పెక్టర్ అభ్యంతరకరంగా మాట్లాడాడని బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు లేఖ పంపించారు.
"నా ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబం నాపై దాడి చేసింది. నాకు స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. దీనిపై పోలీస్ స్టేషన్‌కు వెళ్తే నా ఫిర్యాదు నమోదు చేసుకోలేదు. తర్వాత ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ తన ఛాంబర్లోకి పిలిచి రెండు ఆప్షన్లు ఇచ్చాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని, లేదంటే తాను అడిగినప్పుడల్లా లైంగిక వాంఛ తీర్చాలని అడిగాడు. ఈ డిమాండ్లకు ఒప్పుకుంటేనే సహాయం చేస్తానని చెప్పాడు. నేను ఇందుకు ఒప్పుకోలేదని.. నాతో దుర్భాషలాడాడు. నాపై కనీసం 20 పోలీస్ కంప్లైంట్లు నమోదయ్యేలా చూస్తానని బెదిరించాడు. ఓ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. అతి కష్టం మీద ఆ కేసులో బెయిల్ వచ్చింది."