తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2020, 6:45 AM IST

ETV Bharat / bharat

ఆకాశంలో అద్భుతం- 400 ఏళ్ల తర్వాత ఇవాళే!

ఆకాశంలో అద్భుతం జరగనుంది. గురు, శని గ్రహాలు ఒక్కటిగా కనిపించనున్నాయి. 400 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇలాంటి మహా సంయోగం రాత్రి వేళ జరగడం 800 వందల ఏళ్లలో ఇదే తొలిసారి.

Jupiter-Saturn great conjunction on December 21: How to watch in India
మహా సంయోగం: వినీలాకాశంలో వింత

ఆకాశంలో తరచూ ఏదో ఓ అద్భుతం జరుగుతుంటుంది. భూమిపై ఉన్న జీవులకు వాటిలో కొన్నింటినే చూసే వీలుంటుంది. అలాంటి అద్భుతమొకటి నేడు ఆవిష్కృతం కాబోతోంది. సోమవారం రాత్రి గురు, శని గ్రహాల 'కలయిక' జరగనుంది. భూమి మీద నుంచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన ఒకే నక్షత్రంలా కనిపించనున్నాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంటున్న ఈ ఘట్టం.. చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదీ చదవండి:ఉత్కంఠగా క్రికెట్ మ్యాచ్​.. ఆకాశంలో అద్భుతం!

మహా కలయిక..!

భూమి నుంచి చూసినప్పుడు రెండు గ్రహాలు ఆకాశంలో ఒకేచోటుకు వచ్చినట్లు కనిపిస్తే దాన్ని సంయోగంగా పేర్కొంటారు. ఆ సమయంలో అవి సాధారణ దూరం కంటే పరస్పరం దగ్గరగా ఉంటాయన్నమాట. అయితే మిగతా గ్రహాలకు భిన్నంగా గురుడు, శని 'కలయిక' చాలా అరుదు. సౌర కుటుంబంలోనే అతి పెద్దదైన గురు గ్రహం సూర్యుని నుంచి ఐదోది. రెండో అతిపెద్ద గ్రహమైన శని.. సూర్యుని నుంచి ఆరోది. సూర్యుని చుట్టూ తిరగడానికి గురుడికి 12 ఏళ్లు పడితే, శనికి 30 ఏళ్లు పడుతుంది. పరిభ్రమణ సమయంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఇవి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. అత్యంత దగ్గరగా ఒకే వరసలో ఉన్నట్లు కనిపించడం మాత్రం అరుదు. ఇది సోమవారం ఆవిష్కృతం కానుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా గ్రహాలు కలవడాన్ని సంయోగంగా పిలుస్తామని.. దీన్ని మాత్రం 'మహా సంయోగం'(గ్రేట్‌ కంజంక్షన్‌)గా పేర్కొంటున్నామని తెలిపారు. ఆ సమయంలో భూమి నుంచి చూస్తున్నప్పుడు.. రెండు గ్రహాలు 0.1 డిగ్రీల మేర మాత్రమే ఎడంగా ఉంటాయని చెప్పారు. చివరిసారిగా ఇవి 1623 సంవత్సరంలో ఇంత దగ్గరగా వచ్చాయి. పైగా ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం.. 800 ఏళ్లలో ఇదే మొదటిసారి.

మహా సంయోగం: వినీలాకాశంలో వింత

దగ్గరగా వచ్చినా..

తాజా సంయోగంలో రెండు గ్రహాలు పరస్పరం దగ్గరగా వచ్చినట్లు కనిపించినప్పటికీ.. ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. ముందుభాగంలో ఉండే గురు గ్రహం.. అప్పుడు భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్లీ ఈ గ్రహాలు 2080 మార్చి 15న ఈ స్థాయిలో చేరువగా వస్తాయి.

రెండు గంటలు కనువిందు

భారత్‌లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను మామూలు కంటితో చూడొచ్చు. సోమవారం సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు నైరుతి, పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడాన్ని వీక్షించొచ్చు. గురు గ్రహం ఒకింత పెద్దగా, ప్రకాశవంతమైన నక్షత్రంలా దర్శనమిస్తుంది. దానికి ఎడమ భాగంలో.. కొంచెం పైన శని ఒకింత మసకగా కనిపిస్తుంది. రెండింటినీ స్పష్టంగా, విడివిడిగా చూడాలంటే బైనాక్యులర్‌ను ఉపయోగించాలి. చిన్నపాటి టెలిస్కోపును వాడితే గురు గ్రహం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద చందమామలూ కనిపిస్తాయి.

మరోవైపు.. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటోరియంలో 'మహా సంయోగాన్ని' చూసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బీజీ సిద్ధార్థ తెలిపారు.

ఇదీ చదవండి:'జనవరిలోనే కరోనా వ్యాక్సిన్​'

ABOUT THE AUTHOR

...view details