తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'60 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం.. ఒక్కసారిగా ఇళ్లు కూల్చేస్తే ఎలా?'.. జోషీమఠ్​ వాసుల ఆవేదన

Joshimath Crisis : ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో కూల్చివేత ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది. స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో మంగళవారం కూల్చివేతను నిలిపివేశారు అధికారులు. మరోవైపు ఉత్తరాఖండ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

JOSHIMATH LAND SUBSIDENCE
JOSHIMATH LAND SUBSIDENCE

By

Published : Jan 10, 2023, 7:13 PM IST

Joshimath Crisis : ఉత్తరాఖండ్​ జోషీమఠ్​లో ఇళ్ల కూల్చివేత ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత రెండు హోటళ్లను కూల్చేయాలని భావించినప్పటికీ.. ఆ ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నారు.

జోషీమఠ్​లో పెద్ద ఎత్తున భూమిపై పగుళ్లు ఏర్పడటం వల్ల పలు భవనాలు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటివరకు 678 భవనాలు ప్రమాదకరమని అధికారులు గుర్తించారు. అందులో 66 కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారు. ఆయా ప్రాంతాల్లో ఎస్​డీఆర్ఎఫ్​, ఎన్​డీఆర్ఎఫ్​, పోలీసు బృందాలను మోహరించారు. హైరిస్క్‌ జోన్‌లో ఉన్న భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంధూ ఆదేశించారు. అక్కడివారిని తక్షణం ఖాళీ చేయించాలని సూచించిన సీఎస్​.. ప్రతి నిమిషం చాలా ముఖ్యమన్నారు. అయితే.. ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల అనేక మంది నిర్వాసితులు కంట నీరు పెట్టుకున్నారు.

రోదిస్తున్న వృద్ధురాలు

"ఇది నా తల్లి ఇల్లు. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వివాహం అయ్యింది. ఇందులో 80 ఏళ్ల మా అమ్మ, తమ్ముడు ఉంటున్నారు. అనేక కష్టాల పడి ఈ ఇల్లును కట్టుకున్నాం. 60 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం"

-బిందు, నివాసి

"నా చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నా. ఇప్పుడు అధికారులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. మా కుటుంబంలో 8 మంది ఉన్నాం. ఉండటానికి స్థలం లేక అందరిని బంధువుల ఇంటికి పంపించా. "

-జోషీమఠ్​ నివాసి

భూమిపై ఏర్పడిన పగుళ్ల వల్ల ప్రమాదకరంగా మారిన మౌంట్ వ్యూ, మలారీ ఇన్‌ హోటళ్లను కూల్చివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. కూల్చివేత నేపథ్యంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. రెండు హోటళ్లను మెకానికల్‌ పద్ధతిలో కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు.. ఆ బాధ్యతను సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అప్పగించారు. అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేయాలని అధికారులు నిర్ణయించటంపై.. సదరు హోటళ్ల యాజమానులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కూల్చివేత నిర్ణయం మీడియా ద్వారా తెలుసుకున్నట్లు మలారీ ఇన్‌ హోటల్‌ యజమాని తెలిపారు. ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. తన హోటల్‌ సురక్షితం కాదని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు.. వన్‌టైం సెటిల్‌మెంటు ప్రణాళికతో పరిహారం ఇచ్చి ఉండాలని మలారీ ఇన్‌ హోటల్‌ యాజమాని తెలిపారు. ఎంతో శ్రమించి కట్టిన హోటల్‌ను కూల్చివేస్తే.. తామేం కావాలని ఆయన ప్రశ్నించారు. మౌంట్‌వ్యూ హోటల్‌ యజమాని కూడా ఇలాగే అభ్యంతరం వ్యక్తంచేశారు.

రెండుగా చీలిపోయిన ఇల్లు

ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌, హేమకుంద్‌ సాహిబ్‌, అంతర్జాతీయ స్కీయింగ్‌ కేంద్రం అలీకి.. జోషీమఠ్‌ ముఖద్వారంగా ఉంది. భూమి కుంగటం వల్ల.. జోషీమఠ్‌ ప్రాంతం ప్రమాదంలో పడింది. ఇళ్లు, రోడ్లు, మైదానాల్లో భారీగా పగుళ్లు రావటం వల్ల.. జోషీమఠ్‌ప్రాంతం పూర్తిగా కుంగిపోయే దశకు చేరింది. ఇప్పటికే పలు ఇళ్లు వాలిపోగా.. మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జోషీమఠ్​లో స్వల్ప భూకంప పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత్​, బ్రిటన్ మధ్య జరిగిన జియో సైన్స్​ వర్క్​షాప్​లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు కేంద్ర సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్​.
జోషీమఠ్‌ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 16న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

అమర్​ కల్పవృక్ష

'అమర్​ కల్పవృక్ష'కు ముప్పు
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగద్గురు ఆది శంకరాచార్య ధ్యానం చేసిన 'అమర్​ కల్పవృక్ష'కు ప్రమాదం పొంచి ఉంది. జోషీమఠ్​లో భూమి కుంగిపోవడం వల్ల సమీపంలో ఉన్న జ్యోతిర్​మఠ్​పై ఆ ప్రభావం పడింది. గత 15 రోజుల్లో అనేక పగుళ్లు వచ్చాయని మఠ్​ నిర్వాహకులు తెలిపారు. ఈ చెట్టు వయసు సుమారు 1200 ఏళ్లు ఉంటుందని.. దీని కిందే శంకరాచార్య శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పారు.

ఇవీ చదవండి:26వేల వజ్రాలతో ఉంగరం తయారీ.. అందుకోసమేనట!

ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు.. రక్షించేందుకు విశ్వప్రయత్నాలు

ABOUT THE AUTHOR

...view details