JDU New President Nitish Kumar :బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఇందుకు వేదికైంది. నీతీశ్ కుమార్ జేడీయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఆ పార్టీ నాయకుడు కేసీ త్యాగి తెలిపారు.
ఇప్పటివరకు జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తదుపరి సారథిగా జాతీయ కార్యవర్గ సమావేశంలో నీతీశ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. కార్యవర్గంలోని సభ్యులు ఇందుకు అనుకూలంగా ఓటేశారు.
మరికొద్ది నెలల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'ఇండియా' కూటమిలో కీలక నేతగా ఉన్న నీతీశ్ కుమార్‌కు జేడీయూ పగ్గాలు చేపట్టాలని పార్టీ నేతలు కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నీతీశ్ కుమార్‌ను జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా లలన్ సింగ్ ప్రతిపాదించారని బిహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. 'లలన్ సింగ్ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండడం వల్ల కాస్త బిజీగా ఉంటానని నీతీశ్‌కు చెప్పారు. అందుకే జేడీయూ పగ్గాలు నీతీశ్ కుమార్‌కు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. ' అని విజయ్ కుమార్ చెప్పారు.
'నీతీశ్‌కు ఆ ఉద్దేశం లేదు'
బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌కు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం లేదని జేడీయూ నేత శ్రవణ్ కుమార్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్ష కూటమి 'ఇండియా'ను మరింత పటిష్ఠం చేసి, దేశాన్ని బీజేపీ ముక్త్ భారత్‌గా మార్చాలనేది నీతీశ్ కోరిక అని తెలిపారు.