PAWAN SECOND DAY DELHI TOUR UPDATES: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన-భారతీయ జనతా పార్టీ మధ్య చర్చలు జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే జనసేన అభిమతమని, బీజేపీ అజెండా కూడా అదేనని పవన్ స్పష్టం చేశారు. రెండో రోజు దిల్లీ పర్యటనలో భాగంగా పవన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌తో భేటీ అయ్యారు. ఈ రెండు రోజుల చర్చలు రాబోయే కాలంలో బలమైన సత్ఫలితాలిస్తాయని పవన్ అన్నారు.
"వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేదే జనసేన ప్రధాన ఎజెండా. అదే భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై లోతుగా చర్చలు జరిపాము. అన్ని కోణాల్లో దీనిపై చర్చించాం. రాబోయే రోజుల్లో ఈ చర్చలు బలమైన సత్ఫలితాలను ఇస్తాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనకు విముక్తి కలిగేలానే ఉంటుంది"-పవన్ కల్యాణ్, జనసేన అధినేత
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ పాలనపై జేపీ నడ్డాతో చర్చించామన్న పవన్‌కల్యాణ్...అధికారం సాధించేందుకు ఎలా వెళ్తే బాగుంటుందనే విషయంపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిపారు. బీజేపీతో కలిసి పోటీ చేసే విషయంలో ఎంత వరకు స్పష్టత వచ్చిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ నేతలతో జరిపిన రెండ్రోజుల చర్చలు సంతృప్తినిచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు.