స్వతంత్ర భారతం గడచిన 75 ఏళ్లలో సొంత శాస్త్రసాంకేతిక ప్రజ్ఞతో అంతరిక్ష శక్తిగా ఎదగడం భారతీయులకు గర్వకారణం. 1963లో చిన్నపాటి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో మొదలుపెట్టి క్రమంగా భూకక్ష్యలోకి ఉపగ్రహాలను, చంద్ర, కుజ గ్రహాల వద్దకు అన్వేషక నౌకలను పంపే స్థాయికి భారతదేశం చేరుకుంది. త్వరలో కక్ష్యలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడానికి నడుం బిగిస్తోంది. భారత అంతరిక్ష కార్యక్రమం ఆరంభంలో దేశాభివృద్ధికి తోడ్పడే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను, సహజ వనరుల అన్వేషణకు, వాతావరణ శోధనకు తోడ్పడే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించింది. రైతులకు ఉపగ్రహాల ద్వారా సమాచారం అందించడానికీ ప్రాధాన్యమిచ్చింది. నేడు సుదూర గ్రహాలకు అంతరిక్ష యాత్రలు జరిపే స్థితికి ఎదగడమే కాదు, సైనిక ప్రయోజనాలకూ రోదసిని వేదికగా చేసుకోవడానికి చైనాతో పోటీ పడుతోంది.
ఎన్నెన్నో ప్రయోగాలు!
కొవిడ్ సవాళ్లను ఖాతరు చేయకుండా అంతరిక్ష ప్రయోగాలతో ముందుకెళుతున్న ఇస్రోకు (Isro News) దేశవ్యాప్తంగా పలు శాస్త్రసాంకేతిక సంస్థలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఉపగ్రహ సెన్సర్లు, పేలోడ్‌లు అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ కేంద్రంలో రూపొందుతాయి. ఉపగ్రహ రూపకల్పన, కూర్పు బెంగళూరులోని యు.ఆర్.రావు ఉపగ్రహ కేంద్రంలో జరుగుతాయి. ఉపగ్రహ ప్రయోగ రాకెట్లు తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో (Shar Isro) తయారవుతున్నాయి. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి రాకెట్ ప్రయోగాలు జరుగుతాయి. భూస్థిర కక్ష్యలో తిరిగే ఉపగ్రహాల నియంత్రణ హసన్, భోపాల్ కేంద్రాల నుంచి జరుగుతుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు పంపే సమాచారాన్ని స్వీకరించి, విశ్లేషించే పనిని హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, బెంగళూరులోని అంత్రిక్ష్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఇస్రో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను 1975లో ఒక సోవియట్ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రయోగించారు. 1980లో భారత్ స్వయంగా తయారుచేసుకున్న శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎల్‌వీ) (Pslv Rocket Launch) రాకెట్‌తో రోహిణి ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి భారత్ పలు కీలకమైన ఉపగ్రహ వ్యవస్థలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. టెలికమ్యూనికేషన్లు, టెలివిజన్ ప్రసారాలకు, వాతావరణ పరిశోధన, ప్రకృతి ఉత్పాతాలపై ముందస్తు హెచ్చరికలకు తోడ్పడే ఇన్శాట్ ఉపగ్రహ వ్యవస్థను, సహజ వనరుల శోధనకు ఇండియన్ రిమోట్ సెన్సింగ్ (ఐఆర్‌ఎస్) యంత్రాంగాన్ని సమకూర్చుకుంది. 1988లోనే మొట్టమొదటి ఇన్శాట్, ఐఆర్‌ఎస్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఎస్‌ఎల్‌వీతో మొదలుపెట్టి క్రమంగా మూడు రకాల మలితరం రాకెట్లను తయారుచేయసాగింది. అవి- ధ్రువ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ), భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే జియోస్టేషనరీ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ), భారీ ఉపగ్రహాలు, వ్యోమనౌకల ప్రయోగానికి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3. ఈ మూడు రకాల రాకెట్ల సహాయంతోనే భారతదేశం కమ్యూనికేషన్ ఉపగ్రహాలను, భూపరిశీలక ఉపగ్రహాలను రోదసిలోకి ప్రయోగించింది. 2008, 2009 సంవత్సరాల్లో చంద్రయాన్ 1, 2 ప్రయోగాలకు, 2013లో కుజగ్రహయాత్రకు పై రాకెట్లు ఉపయోగపడ్డాయి. భూకక్ష్యలోకి మానవ వ్యోమగాములను పంపే గగన్‌యాన్ కార్యక్రమానికీ జీఎస్‌ఎల్‌వీ రాకెట్టే ఆధారం. 2022లో గగన్‌యాన్ కింద ఇద్దరు లేక ముగ్గురు వ్యోమగాములను భూకక్ష్యలోకి పంపుతారు. వారు అక్కడ వారం రోజులు గడుపుతారు. కక్ష్యలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గగన్‌యాన్ తొలి మెట్టు అవుతుంది. 2022లో గగన్‌యాన్‌తోపాటు కుజగ్రహం వద్దకు రెండో మంగళ్‌యాన్ కార్యక్రమాన్నీ చేపట్టనున్నారు. సూర్యుడు, శుక్ర గ్రహ శోధనలకూ వ్యోమనౌకలను పంపడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగాలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 రాకెట్లే ఆలంబన. క్రమంగా అంతరిక్ష శోధనలో, ఉపగ్రహ ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్నీ భాగస్వామ్యం చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
నేడు రోదసిలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాల్లో 1,897 అమెరికాకు చెందినవైతే, 412 చైనాకు చెందినవి. రష్యా ఉపగ్రహాలు 176 వరకు ఉంటాయి. భారత్ 2020 చివరి వరకు మొత్తం 120 ఉపగ్రహాలను ప్రయోగించింది. రోదసిలో సైనిక ఉపగ్రహాలకన్నా వాణిజ్య ఉపగ్రహాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి అమెరికా, రష్యా, ఐరోపా దేశాలతోపాటు భారతదేశమూ పోటీపడుతోంది. 2017 ఫిబ్రవరిలో ఒకే దఫాలో 104 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసిలోకి ప్రయోగించి ఇస్రో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మార్చి నాటికి ఇస్రో దాదాపు 35 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల సాయంతో కక్ష్యలోకి ప్రయోగించింది.