UGC Joint Degrees: ఒకే విశ్వవిద్యాలయం నుంచి లేదా వేర్వేరు యూనివర్సిటీల నుంచి ఏకకాలంలో రెండు డిగ్రీ ప్రోగ్రాంలు చేయడానికి ఇటీవలే యూజీసీ అనుమతించింది. ఇప్పుడు ఆ జాయింట్/డ్యూయల్ డిగ్రీ కోర్సులు సహా ట్విన్నింగ్ ప్రోగ్రాంలను భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు కలిసి అందించేందుకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నిబంధనలను ఆమోదించినట్లు తెలిపిన యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్.. అతి త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఉన్నత విద్యామండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
''నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఏదైనా భారతీయ విద్యాసంస్థ లేదా ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లోని టాప్-100 విద్యాసంస్థ లేదా విదేశీ విద్యాసంస్థతో అనుసంధానమైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ టాప్-500లోని విద్యాసంస్థల్లో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఈ డిగ్రీ ప్రోగ్రాంలకు అనుమతి ఉంటుంది.''
- జగదీశ్ కుమార్, యూజీసీ ఛైర్మన్